అకాల వర్షంతో అన్నదాతకు కష్టం

ABN , First Publish Date - 2023-03-18T23:47:45+05:30 IST

పంటను కాపాడుకొనేందుకు రైతుల పరుగులు

అకాల వర్షంతో అన్నదాతకు కష్టం
సూళ్లూరుపేట మండలం ఉగ్గుముడి గ్రామంలో తడిసిపోవడంతో ఆరబెట్టిన మిరప

సూళ్లూరుపేట, మార్చి 18: అకాల వర్షంతో అన్నదాతలకు దిగులు పట్టుకొంది. చేతికొచ్చిన పంట నోటిదాకా రాదేమోనని భయాందోళన చెందుతున్నారు. ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి సూళ్లూరుపేటలో భారీ వర్షం కురిసింది. శనివారం కూడా ఉదయం ఈదులు గాలులతో కూడిన చిరుజల్లుల వర్షం కురవడంతో అన్నదాతల గుండె గుబేలుమంటోంది. పలు గ్రామాల్లో నూర్పిడి చేసిన ధాన్యం రాశులు, మిరప పంట వర్షానికి తడిసిపోయింది. పంటను దాచుకొనేందుకు రైతులకు సరైన వసతులు లేకపోవడంతో కల్లాల్లో, రోడ్లపై ఆరపెట్టి అంబారాలు(కుప్ప) వేశారు. వర్షం ఒక్కసారిగా రావడంతో ధాన్యం రాశులు తడిసిపోవడంతో రైతులు వాటిని ఆరపెట్టుకొని పరదాలు సాయంతో పంటను కాపాడుకొనేందుకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌ వేసిన వరి, మిరప పంటతీత పూర్తయి నూర్పిడి పనులు జరుగు తున్నాయి. పలు గ్రామాల్లో వరిపంట కోత దశకు వచ్చింది. ఈ తరుణంలో వర్షం పడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలకు పంట నాణ్యత దెబ్బతిని మార్కెట్‌లో ధర పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని మంగానెల్లూరు, మంగళంపాడు, ఉగ్గుముడి, కోటపోలూరు తదితర ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని, మిరప పంటను ఆరపెట్టుకొంటున్నారు. ఇప్పటి వరకు పెద్దనష్టం జరగకపోయిన ఇకపై వర్షం పడితే రైతులకు అపార నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది.

Updated Date - 2023-03-18T23:47:45+05:30 IST