ఇసుక దోపిడీపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2023-06-26T23:56:36+05:30 IST

‘జగన్‌ అండ్‌ కో ఇసుక దాహంతో లక్షలాది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. అడ్డగోలుగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపి కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నదీతీర ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీటి కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిజానికి నిబంధనలకు విరుద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతాం.’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు.

ఇసుక దోపిడీపై ఉక్కుపాదం

1800 కి.మీ దాటిన యువగళం

గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశం

నాయుడుపేట/చిట్టమూరు/తిరుపతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ అండ్‌ కో ఇసుక దాహంతో లక్షలాది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. అడ్డగోలుగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపి కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నదీతీర ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీటి కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిజానికి నిబంధనలకు విరుద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతాం.’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. 137వ రోజు యువగళం పాదయాత్ర సోమవారం నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో సాగింది. సూళ్ళూరుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అన్నమేడు యువగళం క్యాంపు సైట్‌లో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తమ కుటుంబాలతో సహా లోకేశ్‌ను కలిశారు. వైసీపీని వీడి తమ కుటుంబాలతో పాటు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.ఈ సందర్భంగా లోకేశ్‌ వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఆ పార్టీవారే భరించలేకపోతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు టీడీపీలోకి వచ్చే వారెవరినైనా ఆహ్వానిస్తామన్నారు.అనంతరం అన్నమేడు గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, రైతులు స్థానిక సమస్యలను లోకేశ్‌కు చెప్పుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ‘పులివెందుల, గిద్దలూరు తర్వాత 63వేల ఓట్ల మెజారిటీతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేను గెలిపించారు. అంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రజలవద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోకుండా లిక్కర్‌, శాండ్‌ మాఫియాతో బిజీగా ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వ్యవసాయ మంత్రిగా ఉన్న మరొకాయన కోర్టు దొంగతనాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయండి. అన్నదాత ఆనందంగా ఉండాలన్నదే చంద్రబాబు ఆశయం. ఆ దిశగా టీడీపీ పనిచేస్తుందని’ భరోసా ఇచ్చారు.

పదికి పది సీట్లిచ్చిన నెల్లూరుకు వైసీపీ చేసిందేమిటి?

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీకి పదికి పది సీట్లు ఇచ్చి గెలిపించారని, అయితే అంత చేసిన జిల్లాకు వైసీపీ నాయకులు చేసిందేమిటని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో అవే సీట్లు తమకివ్వాలని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. అలా అభివృద్ధి చేసి చూపకపోతే తమను చొక్కా పట్టుకుని నిలదీయండని ప్రజలకు పిలుపిచ్చారు.

స్వర్ణముఖిపై చెక్‌డ్యాం నిర్మిస్తాం

ఇసుక తవ్వకాలను క్రమబద్దీకరికరించడంతో పాటు నదీతీర ప్రాంతంలో సాగు, తాగునీటి వనరులకు ఇబ్బంది కలిగించే ఎటువంటి తవ్వకాలను జరగనీయమని లోకేశ్‌ చెప్పారు. స్వర్ణముఖి నదిపై చెక్‌డ్యామ్‌ నిర్మించి తీరగ్రామాల ప్రజలకు సాగునీరు అందజేస్తామన్నారు. పెళ్లకూరులో సాగునీటి అవసరాలకు ఉపయోగపడే చెరువు, సప్లై చానళ్లను ఆక్రమించడం దుర్మార్గమంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలను తొలగించి యధీవిధిగా సప్లయ్‌ చానల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. శిథిలావస్థలో ఉన్న తుఫాను భవనాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

గునపాటిపాళెం వద్ద ఘనస్వాగతం

సూళ్లూరుపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పూర్తిచేసుకుని గునపాటిపాళెం వద్ద గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఇన్‌చార్జి పాశెం సునీల్‌కుమార్‌, ఇతర ముఖ్యనాయకులు పెద్దఎత్తున లోకేశ్‌కు స్వాగతం పలికారు. బహిరంగసభను తలపించే విధంగా గునపాటిపాళెం కూడలి వద్ద జనం కిక్కిరిసిపోయారు.ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు, సాధారణ ప్రజలు సైతం రోడ్డుపైకి చేరుకుని ఆయన రాక కోసం నిరీక్షించారు. ఓ మోస్తరు గ్రామాల వద్ద కూడా ప్రజలు బహిరంగసభకు తరలివచ్చిన రీతిలో భారీగా చేరడం కనిపించింది.తిమ్మారెడ్డి వాగు, జంగాలపల్లి, ఎల్లసిరి, ఈశ్వరవాక మీదుగా తాడిమేడు వరకు పాదయాత్ర కొనసాగింది.

ఇప్పటివరకు నడిచిన దూరం 1806.8 కి.మీ

138వ రోజు నడిచిన దూరం :19.2 కి.మీ

మొదలు పెట్టిన చోటు : అన్నమేడు బస కేంద్రం నుంచి ప్రారంభం

సాగిందిలా : వేముగుంటపాళెం, గునపాటిపాళెం, పెళ్లకూరు, తిమ్మారెడ్డి వాగు, వడ్డికండ్రిగ, ఎల్లసిరి, ఈశ్వరవాక, బయ్యావారి కండ్రిగ మీదుగా తాడిమేడు క్రాస్‌ విడిది కేంద్రానికి లోకేశ్‌ చేరుకున్నారు.

నేటి పాదయాత్ర ఇలా...

2గంటలు- తాడిమేడు విడిదికేంద్రంలో మత్స్యకారులతో ముఖాముఖి

4.00- పాదయాత్ర ప్రారంభం

4.30- కొత్తగుంటలో రైతులతో సమావేశం

4.50- చిట్టమూరులో స్థానికులతో సమావేశం

5.20- వాకాడు ఎస్టీ కాలనీలో స్థానికులతో మాటామంతి

6.20- వాకాడు బీసీ కాలనీలో సమావేశం

6.30- వాకాడు టెంపుల్‌ జంక్షన్‌లో స్థానికులతో సమావేశం

6.50- వాకాడు అశోకా పిల్లర్‌ వద్ద స్థానికులతో మాటామంతి

7.20- రంగన్నగుంటలో స్థానికులతో మాటామంతి

7.50- తినెళ్లపూడిలో స్థానికులతో సమావేశం

8.20- కోట క్రాస్‌ విడిది కేంద్రంలో బస

Updated Date - 2023-06-26T23:56:36+05:30 IST