గంగమ్మ గుడిలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:02 AM
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిధుల గోల్‌మాల్‌పై ఐదు రోజులుగా జరుతున్న విచారణ తుదిదశకు చేరుకుంది. ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ‘గంగమ్మ గుడిలో గోల్‌మాల్’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం అటు దేవదాయ శాఖతో పాటు ఇటు నగరంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
సిబ్బంది చేతివాటంతో రూ.52లక్షల గల్లంతు
28న ఆర్జేసీకి తుది నివేదిక
తిరుపతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిధుల గోల్‌మాల్‌పై ఐదు రోజులుగా జరుతున్న విచారణ తుదిదశకు చేరుకుంది. ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ‘గంగమ్మ గుడిలో గోల్‌మాల్’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం అటు దేవదాయ శాఖతో పాటు ఇటు నగరంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆరోపణలపై నిగ్గుతేల్చాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో దేవాదాయ శాఖ ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. తిరుపతి దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఫణిరాజ్, సహాయ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, పక్క జిల్లాల నుంచి మరో ముగ్గురిని నియమించారు. ఐదు రోజుల పాటు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.52 లక్షలకు లెక్కలు రాయకపోవడంతో పాటు మరో రూ.50లక్షల వరకు తప్పుడు లెక్కలు రాసినట్టు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చినట్టు తెలియవచ్చింది. జనరల్ అకౌంట్‌కు సంబంధించి రూ.31లక్షలు, ఆలయ ప్రాకారానికి సంబంధించి రూ.22లక్షలు గల్లంతైనట్టు తెలియవచ్చింది. సీఎం జగన్ ఆలయ సందర్శన సందర్భంగా దాదాపు రూ.30లక్షలు ఖర్చుపెట్టామని లెక్కలు రాసేసినట్టు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా పందిళ్లు వేసినట్టు పలుసార్లు రూ.లక్షల్లో లెక్కలు చూపించడంతో పాటు జాతర వారాలు, నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి సేవలకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇవి బయటపడకుండా రశీదులను దగ్ధం చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు సిబ్బంది చేతివాటంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. లావాదేవీల గందరగోళంపై సిబ్బందిని విచారణ కమిటీ ప్రశ్నిస్తే ఇటీవల మృతిచెందిన ఇన్‌చార్జ్ ఈవో మునికృష్ణయ్యపై నెట్టేస్తున్నట్టు సమాచారం. తుది నివేదికను ఈనెల 28న దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్‌కు కమిటీ అందజేయనుంది.విచారణ కమిటీపైనా రాజకీయపరమైన ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. తుది నివేదికపై ఆర్జేసీ నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని గంగమ్మ భక్తులు కోరుతున్నారు.