దొంగ ఓటర్లతోనే చెల్లని ఓట్లు!
ABN , First Publish Date - 2023-03-18T06:34:11+05:30 IST
తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో చెల్లని ఓట్లు భారీగా బయటపడ్డాయి.

తూర్పు సీమలో దాదాపు 21 వేలు... పశ్చిమ సీమలో 15వేలకు పైగా చెల్లలేదు
బ్యాలెట్ పేపర్‌పై సంతకాలు, టిక్కులు
చిత్తూరు/కడప/అనంతపరం మార్చి 17(ఆంధ్రజ్యోతి): తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో చెల్లని ఓట్లు భారీగా బయటపడ్డాయి. విపక్షాలు మొదటినుంచీ ఆరోపిస్తున్నట్లుగా దొంగ ఓటర్లను పెద్దసంఖ్యలో చేర్చడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరులో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ ఏకంగా 20,979 ఓట్లుగా చెల్లనివిగా తేల్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,81,181 ఓట్లు ఉండగా, 2,69,339 పోలయ్యాయి. చెల్లనివి మినహాయిస్తే 2,48,360 ఓట్లు వ్యాలిడ్‌గా మారాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెల్లని ఓట్లు ఎక్కువ సంఖ్యలో బయటపడ్డాయి. ఈ నియోజకవర్గంలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 40వేల వరకూ దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 7వేల దొంగ ఓట్లను వైసీపీ నమోదు చేయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా పోలింగ్ రోజున తిరుపతిలో పెద్దఎత్తున దొంగ ఓటర్లు పట్టుబడ్డారు. వారంతా 6-10 తరగతులు చదివినవారు కావడం, కొందరు చదువు రానివారు కూడా ఉండటంతో తగిన అవగాహన లేక ఓటు సరిగా వేయలేదని తెలుస్తోంది. అభ్యర్థి పక్కన ఒకటి అని సంఖ్య వేయకుండా టిక్ పెట్టడం, రౌండ్ చుట్టడం, సంతకాలు చేయడం వంటి కారణాలతో అధిక సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. గతంలో జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ దొంగ ఓటర్లను నమోదు చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తిరస్కరించారని, తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో 15,104 వరకూ చెల్లని ఓట్లు వెలుగు చూశాయి. అధికార వైసీపీ దొంగ ఓట్లను భారీగా నమోదు చేయడం వల్లే ఈసారి చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పట్టభద్రుల్లో కొందరు ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉండటం, వారు ఓటింగ్‌కు రారనే విషయాన్ని వలంటీర్ల ద్వారా అధికార పార్టీ నేతలు ముదుగానే ధ్రువీకరించుకున్నారు. వారి స్థానంలో కిరాయి మనుషులను ఓటర్లుగా నమోదు చేయించారు. అయితే వీరికి చదువు రాకపోవడం, ఓటింగ్ ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో బ్యాలెట్ పేపరులో టిక్కులు పెట్టడంతో ఆ ఓట్లు ఇన్‌వాలిడ్ ఆయినట్లు చెబుతున్నారు.
దొంగ ఓట్లతోనే గెలుపు?
వైసీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి గెలుపులో దొంగ ఓట్లు దోహదపడినట్లుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డి కొనసాగుతున్న నేపఽథ్యంలో పలు ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత లేనివారిని కూడా టీచర్లుగా దొంగ ఓట్లు నమోదు చేశారు. దీనిపై కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వారెవరినీ జాబితా నుంచి తొలగించలేదు. కడప ఆర్జేడీగా వచ్చిన ప్రతా్‌పరెడ్డి... రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారిని బెదిరించారనే అరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను ప్రలోభపెట్టి రూ.5వేలు వంతున పంపిణీ చేశారు. నోటిఫికేషన్ రాకముందే గిఫ్ట్‌లు అందించారు. ఎన్నికల బరిలో నలుగురు ఉండటంతో వ్యతిరేకత వల్ల ఓట్లు చీలాయి.