జీడీనెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2023-09-22T01:09:49+05:30 IST

సీఎం జగన్‌ చేతగాని పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలకు భిక్షాటనే గతి అయిందన్నారు.

జీడీనెల్లూరులో టీడీపీ నేతల వినూత్న నిరసన
భిక్షాటన చేస్తూ వినూత్న తరహాలో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు

గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 21: సీఎం జగన్‌ చేతగాని పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలకు భిక్షాటనే గతి అయిందన్నారు. ఈ మేరకు గురువారం గంగాధరనెల్లూరులోని రిలే నిరాహార దీక్షా శిబిరంలో నేతలు, కార్యకర్తలు చేతుల్లో ప్లేట్లను పట్టుకుని చిత్తూరు- పుత్తూరు రోడ్డుపై అటు ఇటు వెళుతున్న వారిని బాబ్బాబు ధర్మం చేయండి అంటూ భిక్షాటన చేస్తూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన ఈ దీక్షలో దళిత, ముస్లిం కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఒక చాన్సు పేరిట మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు కోలుకోలేని విధంగా అప్పుల్లోకి నెట్టేశారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌, నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గుండయ్య, ప్రధాన కార్యదర్శి దేవసుందరం, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు స్వామిదాస్‌, జిల్లా పార్టీ కార్యదర్శి తలారి రెడ్డెప్ప అన్నారు. సీఎం జగన్‌ కాళ్లపై పడి దళితుల ఆత్మగౌరవాన్ని మంట కలిపారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ధ్వజమెత్తారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ ద్వారా యువతను చంద్రబాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా తీర్చిదిద్దితే, సీఎం జగన్‌ గ్రామవలంటీర్లుగా తయారు చేశారని పార్లమెంట్‌ టీడీపీ ముస్లిమ్‌ మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి సంధాని, నియోజకవర్గ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు నౌషాద్‌ ఎద్దేవా చేశారు.

బాబుతో మేము : కుప్పం తెలుగు తమ్ముళ్ల నిరసనలు

కుప్పం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రోజుకురోజుకు తీవ్రమవుతోంది. కుప్పంలోని దీక్షా శిబిరంలో గురువారం ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అక్కడినుంచి బస్టాండు సర్కిల్‌కు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. చంద్రబాబు ఎటువంటి నేరం చేయలేదని సంబంధిత వ్యక్తులు, కంపెనీలు చెబుతున్నా.. కక్షపూరిత మనస్తత్వం కలిగిన జగన్‌ ఎదుట చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అవుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి అవకాశం రాగానే వీరికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, సత్యేంద్రశేఖర్‌, చంద్రశేఖర్‌, కన్నన్‌, మురుగేశ్‌, వెంకటేశ్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాల నోరు నొక్కేందుకే..

పలమనేరు: ‘ప్రతిపక్షాల నోరు నొక్కేందుకే పథకం ప్రకారం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఈ చర్యతో సీఎం జగన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు’ అని టీడీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గురువారం పలమనేరులో టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు, పార్టీ నేలు మోటరుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ నాయకులు నాగరాజు, గిరిబాబు, రవి, టీడీపీ నేతలు ఖాజాపీర్‌, సుబ్రమణ్యం గౌడు, మాబాషా, అప్రోజ్‌, వెంకటరమణ, రెడ్డెప్ప, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T01:09:49+05:30 IST