దొరక్కపోతే డాక్టర్లే!

ABN , First Publish Date - 2023-06-01T01:29:48+05:30 IST

ఆర్‌ఎంపీలు.. పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. మాత్రలు రాసివ్వకూడదు. వైద్యం చేయకూడదు. గ్రామాల్లో తక్షణం ఫస్ట్‌ ఎయిడ్‌ జరిగాక రోగులు నిపుణులైన డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంది. వీరు డాక్టర్లుగా పేరు పెట్టుకోకూడదు. క్లినిక్‌ అని బోర్డులూ ఏర్పాటు చేసుకోరాదు.

దొరక్కపోతే డాక్టర్లే!
అబార్షన్‌ చేసి మహిళ ప్రాణాపాయస్థితికి కారకురాలైన పీఎంపీని అరెస్టుచేస్తున్న పోలీసులు (ఫైల్‌ ఫొటో)

వైద్యం చేసేస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు

అధిక డోసేజ్‌తో దెబ్బతింటున్న రోగుల ఆరోగ్యం

జిల్లాలో నకిలీలపై కొరవడిన నిఘా

ఆర్‌ఎంపీలు.. పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. మాత్రలు రాసివ్వకూడదు. వైద్యం చేయకూడదు. గ్రామాల్లో తక్షణం ఫస్ట్‌ ఎయిడ్‌ జరిగాక రోగులు నిపుణులైన డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంది. వీరు డాక్టర్లుగా పేరు పెట్టుకోకూడదు. క్లినిక్‌ అని బోర్డులూ ఏర్పాటు చేసుకోరాదు.

కానీ, జిల్లాలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు గర్భిణులకు స్కానింగ్‌ నుంచి అబార్షన్ల వరకు.. జ్వరాలు, ఇతరత్రా వ్యాధులకూ చికిత్స చేసేస్తున్నారు. క్లినిక్‌లు పెట్టుకుని మందులూ రాసిస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ ప్రాక్టీషనర్లు కాని వారూ నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేసేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో పీఎంపీలు ప్రాక్టీస్‌ చేయకూడదన్న నిబంధనను ఖచ్చితంగా అమలు అమలు చేస్తున్నారు. దీంతో మన జిల్లాకు సరిహద్దున ఉన్న పళ్లిపట్టులో క్లినిక్‌లు నిర్వహిస్తున్న పీఎంపీలు అందరూ అక్కడ నుంచి వచ్చేశారు. తమిళనాడుకు సరిహద్దు అయిన కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాలకు వీరి క్లినిక్‌లను మార్చారు. జిల్లాకు చెందిన పీఎంపీ అసోసియేషన్‌ నుంచి సర్టిఫికెట్లు తీసుకొని అర్హత లేకున్నా క్లినిక్కులను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. స్కానింగ్‌ నుంచి అబార్షన్‌ వరకు వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరైతే పెద్ద డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తే కమీషన్‌ తప్ప తమకు మరేమి రాదని వారే అబార్షన్లు చేస్తూ మహిళలను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తున్నారు. వీరి అరకొర వైద్యానికి బలయ్యేది కూలీలు.. పేదలే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉండరు. వీళ్లేమో సాయంత్రం వరకు కూలి పనులు చేసుకుని వస్తారు. పిల్లలు.. ఇతర కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉంటే సాయంత్రం తర్వాత వైద్యానికి తీసుకొస్తారు. ఆ సమయంలో వీరికి అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలే దిక్కుగా మారారు. ఏ రోగం వచ్చినా వీరి వద్దకే పరుగులు తీస్తుంటారు. ఇదే అదునుగా చూసుకొని వారి రోగం త్వరగా తగ్గాలని అధిక డోస్‌లు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. అధిక మొత్తంలో మందులు రాసి రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరైతే వారే మందులు తీసుకొచ్చి పెట్టుకుని.. వైద్యం చేసి మాత్రలూ ఇస్తున్నారు. కొందరు అనర్హులూ పీఎంపీ అసోసియేషన్‌ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుని వైద్యం చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరంతా కలిసి అరకొర వైద్యంతో గ్రామీణ పేదలను మరింత అనారోగ్యానికి గురిచేస్తూ.. ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకునే వారేరి? కనీసం తనిఖీలూ లేకపోవడంతో వారి హవా కొనసాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

డాక్టర్లుగా చెలామణి అవుతూ..

ఫ కార్వేటినగరం మండలం కొల్లాగుంటలో తాను ఆర్‌ఎంపీ డాక్టర్‌నంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇతడు తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టులో క్లినిక్‌ నిర్వహిస్తుండగా.. తప్పుడు వైద్యం అందిస్తున్నారనే ఫిర్యాదులతో రెండుసార్లు అరెస్టు చేసినట్లు సమాచారం. అక్కడ్నుంచి వచ్చి తమిళనాడు సరిహద్దు అయిన కొల్లాగుంట క్రాస్‌ వద్ద క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఇతడి క్లినిక్‌లో ఏకంగా ఇన్‌పేషంట్‌ బెడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా మెడికల్‌ షాపూ నిర్వహిస్తున్నారు.

ఫ ఎస్‌ఆర్‌ పురం మండలం పుల్లూరు క్రాస్‌లోనూ ఓ ఆర్‌ఎంపీ ఏ రోగం వచ్చినా 5 రకాల మాత్రలతో సరిపెడుతున్నారట. తమిళనాడులోని ప్రభుత్వాస్పత్రులకు వచ్చే మాత్రలు తెచ్చుకొని స్ట్రిప్‌ను తొలగించి వాటిని పొట్లాలు కట్టి అమ్మేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక, పిల్లలకు జ్వరం వచ్చినా పెద్ద వారికిచ్చే మాత్రల్లో సగం వేసుకోవాలని మందులు రాసిస్తున్నారని.. తగ్గకుంటే పిల్లలకు సైతం స్టెరాయిడ్స్‌ ఇస్తున్నట్లు విమర్శలున్నాయి.

తెలిసీ తెలియని వైద్యంతో..

ఫ ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లారికుప్పంలో ఓ ఆర్‌ఎంపీ.. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం పేరులో మంత్రాలు, తంత్రాలు చేస్తుంటారు. అతడి క్లినిక్‌ మొత్తం కూడా యంత్రాలతో దర్శనమిస్తుంది. ఇతడి సొంతూరు తమిళనాడులోని పళ్లిపట్టు. కాగా, 20 రోజుల కిందట పిల్లారికుప్పం కాలనీకి చెందిన ఓ చిన్నారికి జబ్బు చేసిందని వస్తే ఆయన మాత్రలు ఇచ్చి పంపారు. చిన్నారికి జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ అతడి వద్దకు తీసుకెళ్లారు. అతడు ఆమెను కాసేపు పరీక్షించి.. పాపకు మందులతో జబ్బు తగ్గదని దాటు తీయాలని తల్లిదండ్రుల వద్ద రూ.5500 తీసుకొని ఏవో పూజలు చేసి తాయత్తు కట్టి పంపించారు. మళ్లీ రెండు రోజులైనా జ్వరం తగ్గక పోవడంతో చిన్నారిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి డెంగ్యూగా తేల్చారు. సకాలంలో తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఫ రెండేళ్ల కిందట ఓ నాలుగు నెలల గర్భిణి శిశువు ఆడా, మగా అని తెలుసుకునేందుకు తన భర్తతో కలిసి చిత్తూరు నగరం సంతపేట మేదరవీధిలో పీఎంపీ అఖిలాండేశ్వరి వద్దకు వచ్చారు. ఆమె పాతబస్టాండ్‌ వద్ద ఓ కేంద్రంలో స్కానింగ్‌ చేయించగా ఆడబిడ్డ అని చెప్పారు. అబార్షన్‌ చేయించుకోవాలని వారు పీఎంపీని కోరారు. వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్తే కేవలం కమీషన్‌ తప్ప మరేం రాదనుకొని, తానే ఆపరేషన్‌ చేసి అబార్షన్‌ చేశారామె. అబార్షన్‌ చేసినప్పటి నుంచి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో మళ్లీ ఆమెను తీసుకొని పీఎంపీ దగ్గరకు రాగా అది మామూలే అని పెయిన్‌ కిల్లర్‌ ఇచ్చే పంపేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్‌ చేసి అబార్షన్‌ సరిగా చేయకపోవడంతో కడుపులో పేగులు కుళ్లి పోయాయని.. కాస్త ఆలస్యమై ఉంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. బాధితుల సమాచారంతో డీఎంహెచ్‌వో పీవోడీటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఆర్‌ఎంపీని అరెస్టు చేశారు.

- చిత్తూరు రూరల్‌

Updated Date - 2023-06-01T01:29:48+05:30 IST