అణ చివేయాలని చూస్తే ఇంటికి పంపుతాం
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:28 PM
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న తమను అణచివేయాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.
సమ్మెలో యూనియన్ నేతల హెచ్చరిక
చిత్తూరు, డిసెంబరు 18: న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న తమను అణచివేయాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అంగన్ సమ్మె సోమవారంతో ఏడవ రోజుకు చేరుకుంది. ఫ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే వాటిని పరిష్కరించకపోగా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆ సంఘ నాయకులు సుజని, అరుణ, బుజ్జి తదితరులు పేర్కొన్నారు. గతంలో అంగన్‌వాడీ వర్కర్లతో పెట్టుకున్న వారు ఏమయ్యారో గుర్తించుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో చిన్నయ్యకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంల అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఫ కార్వేటినగరం ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు నోటికి నల్లగుడ్డలు ధరించి నిరసన తెలిపారు. వీరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోటుగాని భాస్కర్ సంఘీభావం ప్రకటించారు. అంగన్‌వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు. ఫ పలమనేరు ఆర్డీవో కార్యాలయం వద్ద వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం ఆర్డీవో మనోజ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఫ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడీలు కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ శ్రీధర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని అంగన్వాడీలను తరలించడానికి ప్రయత్నించారు. ఈ చర్యపై అంగన్వాడీలు తిరగబడ్డారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా కొనసాగించారు.
పాత్రలు కడగలేదని అంగన్‌వాడీ సిబ్బందికి మెమో
వెదురుకుప్పం, డిసెంబరు 18: వంట పాత్రలను శుభ్రపరచకుండా సమ్మెలోకి వెళ్లారంటూ వెదురుకుప్పం మండలం కురివికుప్పం అంగన్‌వాడీ వర్కర్, ఆయాకు మెమో జారీ చేశారు. సోమవారం కురివికుప్పం, జీటీకండ్రిగ అంగన్‌వాడీ కేంద్రాలను కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మసునంద సందర్శించిన అనంతరం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.