జాగా కనిపిస్తే కబ్జానే!
ABN , First Publish Date - 2023-10-30T01:42:00+05:30 IST
ఖాళీ జాగా కనిపిస్తే చాలు. సొంతం చేసుకుంటున్నారు. అధికార పార్టీలో నేతల స్థాయిని బట్టి భూముల విస్తీర్ణం ఉంటుంది.
రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
చిత్తూరు, అక్టోబరు 24: ఖాళీ జాగా కనిపిస్తే చాలు. సొంతం చేసుకుంటున్నారు. అధికార పార్టీలో నేతల స్థాయిని బట్టి భూముల విస్తీర్ణం ఉంటుంది. చిత్తూరు చుట్టుపక్కల భూముల విలువ పెరగడంతో ఒకటి రెండు సెంట్లనూ వదలడంలేదు. గుట్టలు, కొండలనూ చదును చేసేస్తున్నారు. తాజాగా చిత్తూరు నగర పరిధిలోని ప్రశాంత్‌నగర్ సమీపం అనుప్పల్లె రెవెన్యూలో సర్వే నెంబరు 1, 2లో (తిమ్మిసానిపల్లె రోడ్డుకు ఎడమవైపుకు) రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారు. తమకు కమ్యూనిటీ హాలు, ఆస్పత్రి తదితర అవసరాలకు ఉపయోగపడుతుందని పక్కనే ఉన్న వైఎస్సార్ నగర్‌కాలనీవాసులు ఈ స్థలాన్ని వదులుకున్నారు. ఈ స్థలంపై కొందరి కన్నుపడింది. ఇటీవల కొందరు అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకొని ఈ స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు సృష్టించారు. ఒక్కో ఇంటి స్థలాన్ని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశం నుంచి వెనుకవైపున క్రిస్టియన్లు ప్రార్థన చేసుకోవడం కోసం కొంత స్థలాన్ని వదులుకున్నారు. ఈ నిర్మాణాల కారణంగా అక్కడికి వెళ్లడానికి కూడా దారి లేకుండాపోయింది. ఈ నిర్మాణాలను అడ్డుకుంటే అధికార పార్టీ నేతపేరు చెప్పి బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ స్థలం ప్రజల ఉపయోగానికి కావాలని, అక్రమ నిర్మాణాలను ఆపించాలని కోరుతూ కాలనీవాసులు చిత్తూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని హామీ ఇచ్చారే తప్ప పట్టించుకోలేదు. దీంతో గతవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారని తెలుసుకున్న నిర్మాణదారులు ఇళ్ల పనులను మరింత వేగంగా చే స్తున్నారు.