Share News

అనుమతుల్లేకుండా పాలకేంద్రం ఎలా కూలుస్తారు?

ABN , First Publish Date - 2023-12-03T02:37:54+05:30 IST

వి.కోట మండలం బోయచిన్నాగనపల్లె పంచాయతీ లింగాపురంలోని బ్రిటీష్‌ హయాం నాటి పాలకేంద్రాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం వివాదానికి దారితీసింది.

అనుమతుల్లేకుండా పాలకేంద్రం ఎలా కూలుస్తారు?
కూల్చివేసిన పురాతన పాలకేంద్ర భవనం - ఎంపీపీని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు

పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదు

వి.కోట, డిసెంబరు 2: వి.కోట మండలం బోయచిన్నాగనపల్లె పంచాయతీ లింగాపురంలోని బ్రిటీష్‌ హయాం నాటి పాలకేంద్రాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం వివాదానికి దారితీసింది. శనివారం ఉదయం ఎక్స్‌కవేటరుతో ఉన్నపళంగా పాలకేంద్రాన్ని కూల్చుతుండగా.. అక్కడి వారు అడ్డగించారు. ఎంపీపీ యువరాజ్‌ ఆదేశాలతో తాము కూలుస్తున్నట్లు ఎక్స్‌కవేటరు ఆపరేటర్‌ చెప్పారు. తమ గ్రామంలో ఎవరి అనుమతి లేకుండా తొలగింపునకు ఒప్పుకొనేది లేదంటూ వాహనాన్ని ఆపేశారు. ఎంపీపీ అక్కడకు రాగా.. గ్రామస్తులు నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పాడిరైతులు సహకార సంఘం అక్కడ పాలసేకరణ కోసం ఈ కేంద్రాన్ని వినియోగించుకునేవారమని, దానిని తొలగించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ స్థలమని తాము గ్రంఽథాలయ నిర్మాణం కోసం మార్కింగ్‌ ఇచ్చామని ఎంపీపీ బదులిచ్చారు. పంచాయతీ తీర్మానం ఉందని, అందుకే తొలగిస్తున్నామన్నారు. ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న స్థలాన్ని కాదని పురాతన నిర్మాణాన్ని ఎలా కూలుస్తారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ భవనం తొలగింపు తమకూ తెలియదని, పంచాయతీలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సర్పంచి స్పష్టంచేశారు. ఎంపీపీ కక్షపూరితంగా పురాతన భవనాన్ని తొలగిస్తున్నారని ఎక్స్‌వేటర్‌ తాళాలు, శిథిలాలు తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. పాలకేంద్రాన్ని ధ్వంసం చేసి కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఎంపీపీ యువరాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళాలు సీఐ లింగప్పకు అందజేశారు. తనపై ఫిర్యాదు ఇచ్చారని తెలుసుకున్న ఎంపీపీ యువరాజ్‌ కూడా.. గ్రంథాలయ పనులు చేపడుతుంటే మాజీ ఎంపీటీసీ భక్తవత్సలం దౌర్జన్యంగా అడ్డుకుని, వాహనాలను ఆపించి తనను దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాలను పిలిపించి ఎలాంటి తగాదా లేకుండా పనులు చేసుకోవాలని సీఐ సర్దిచెప్పి పంపారు. అధికార పార్టీ నేతలు కావాలనే ఈ పాలకేంద్రాన్ని తొలగించారని, ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు.

Updated Date - 2023-12-03T02:37:54+05:30 IST