నాయకుడంటే ఈయన కదా!

ABN , First Publish Date - 2023-05-28T01:58:45+05:30 IST

ఎన్ని తరాలైనా ఎడతెగని బంధం... తిరుపతితో నందమూరి అనుబంధం నగర ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న సంస్థలు

నాయకుడంటే ఈయన కదా!

(ఆంధ్రజ్యోతి - తిరుపతి)

తెలుగు సినిమా మీద ఆయన ప్రభావం ఎంత బలమైనదో, రాజకీయాల మీదా ఆయన ముద్ర అంతకన్నా బలమైనది. నటుడిగా ఆయన పోషించిన పాత్రల విలక్షణత.. కోట్లాది మందికి ఆరాధ్యుడిగా ఆయనను నిలిపింది. నాయకుడిగా ఆయన విధాన నిర్ణయాల ఫలితం.. పేదల గుండెల్లో ఆయనను దేవుడిగా నిలిపింది. నటుడిగానూ, నాయకుడిగానూ ఎన్టీయార్‌కు తిరుపతితో అనుబంధం అనన్యమైనది. అనేక సంచలనాలకు ఈ నగరం వేదిక అయ్యింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అభివృద్ధికి ఆయన దారిదీపం అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎటుచూసినా ఎన్టీ రామారావు సీఎంగా మంజూరు చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి. జిల్లావ్యాప్తంగా డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, ఆర్టీసీ బస్‌ స్టేషన్లు ఎన్నో ఆయన వరాలే. ఎనీయార్‌ శతజయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో మెదులుతున్న ఆయన జ్ఞాపకాల దొంతర ఇది...

తిరుపతి వేదికగా..

తిరుమల శ్రీవారి పట్ల ఎన్టీయార్‌కి ఎనలేని భక్తి. తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో అనేక ముఖ్య సందర్భాలకు తిరుపతిని వేదిక చేసుకున్నారు. టీడీపీ స్థాపించాక తొలి రాజకీయ సభ తిరుపతిలోనే జరిపారు. తొలి ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేసి గెలిచారు. సీఎంగా తిరుమల, తిరుపతిల అభివృద్ధికి అమిత ప్రాధాన్యత ఇచ్చారు. తిరుమలను సమూలంగా ప్రక్షాళన చేశారు. టీటీడీ పాలక మండలి గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తిరుపతి నుంచే ఎన్నికల ప్రచారాలను ప్రారంభించేవారు. ఆయన జీవితంలో వివాదాస్పద ఘట్టంగా పరిణమించిన లక్ష్మీపార్వతితో వివాహ ప్రకటన కూడా తిరుపతి నుంచే చేశారు.

ఆయన ముద్దుబిడ్డ మహిళా విశ్వ విద్యాలయం

ఎన్టీ రామారావు సీఎం కాగానే 1983 ఏప్రిల్‌ 14న తిరుపతిలో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. అప్పటికి అది దేశంలోనే రెండవ మహిళా విశ్వవిద్యాలయం. 138 ఎకరాల విశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ వర్శిటీ కాలక్రమంలో అభివృద్ధి చెంది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. మహిళలకు ఆస్తిహక్కు కల్పించడం ద్వారా మహిళా పక్షపాతిగా ముద్ర వేసుకున్న ఆయన వారికి విద్యావకాశాలు కూడా కల్పించే దిశగా మహత్తరమైన విశ్వవిద్యాలయం నెలకొల్పారు.

తిరుమలలో నిత్యాన్నదానం

తిరుమలకు నిత్యం వచ్చే భక్తులకు టీటీడీ ద్వారా ఉచిత అన్నప్రాసాదాలు అందించాలన్న ఎన్టీ రామారావు నిర్ణయం ఇవాళ రోజుకి లక్ష మంది కడుపు నింపుతోంది. 1985 ఏప్రిల్‌ 6న నిత్యాన్నదాన పథకాన్ని ఆయన ప్రారంభించగా ఇప్పటి వరకూ దాతల నుంచీ రూ. వెయ్యి కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.

వికలాంగుల కోసం బర్డ్‌

జైపూర్‌ తరహాలో తిరుపతిలో కూడా వికలాంగులకు అధునాతన వైద్యసేవలందించాలన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు టీటీడీ ద్వారా 1985లో బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రీసెర్చి అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ డిసేబుల్డ్‌ పేరిట (బర్డ్‌) వైద్య సంస్థను ఏర్పాటు చేయించారు. కాలక్రమంలో అభివృద్ధి చెందిన బర్డ్‌ ఆసుపత్రి ఇపుడు ఆర్థోపెడిక్‌ విభాగంలో దేశంలోనే పేరుమోసింది.

సీమ కోసం స్విమ్స్‌

రాయలసీమ వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ద్వారా 1986లో శ్రీ వెంకటేశ్వరా వైద్య విజ్ఞాన సంస్థకు శంకుస్థాపన చేశారు. స్విమ్స్‌ పేరిట ప్రాచుర్యంలో వున్న ఈ సంస్థ 1995లో యూనివర్శిటీ హోదానందుకుంది. ఇపుడు అనేక శాఖలు ఏర్పాటు చేసుకుని నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసుకోవడం వరకూ విస్తరించింది.

పీలేరులో సహకార నూనెవిత్తుల కర్మాగారం

అప్పటి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాధారిత వేరుశెనగ పంట సాగు ఎక్కువగా వుండడాన్ని దృష్టిలో వుంచుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎన్టీ రామారావు సీఎం అయిన వెంటనే ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌కు అనుబంధంగా శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల సహకార సంఘాన్ని ఏర్పరిచారు. పీలేరులో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించారు. ప్రభుత్వమే రైతుల నుంచీ వేరుశెనగ కొని ఈ ఫ్యాక్టరీలో నూనె, కేక్‌ తదితర ఉత్పత్తులు తయారు చేయించేది. దీనికి తొలి ఛైర్మన్‌గా కేవీపల్లి మండలం తిమ్మాపురానికి చెందిన రఘురామిరెడ్డిని నియమించారు. కొంతకాలం రైతులకు గిట్టుబాటు ధర అందించిన ఈ సంస్థ తర్వాత నిర్వహణాపరమైన లోపాలతో మూతపడింది.

తమిళనాడుకు స్నేహపూర్వక తెలుగు గంగ

దశాబ్దాల పర్యంతం తెలుగు చిత్ర పరిశ్రమకు నీడనిచ్చిన చెన్నై నగరం పట్ల కృతజ్ఞతతో, చెన్నై వాసుల రుణం తీర్చుకునేందుకు ఎన్టీ రామారావు సీఎం అయిన తొలి ఏడాదే తెలుగు గంగ పథకం ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచీ చెన్నై నగర వాసులకు తాగునీరందించడమే లక్ష్యం అయినా చెన్నై వాసుల దాహం తీర్చడంతో పాటు తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటినందిస్తోంది.

హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతులు

నికర సాగునీటి వనరులు లేక క్షామ పీడిత ప్రాంతంగా మారిన పూర్వపు చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఎన్టీ రామారావు 1985లో కృష్ణా నదీ మిగులు జలాల ఆధారంగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు మంజూరు చేశారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 54 మండలాల పరిధిలో 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆ మండలాల పరిధిలోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అలాగే గాలేరు-నగరి ద్వారా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని మండలాల్లో 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరందించడం లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.

రూ. 2కే కిలో బియ్యం భాకరాపేట నుంచే

దేశవ్యాప్తంగా గుర్తింపునకు నోచుకున్న సంక్షేమ పథకాల్లో రూ. 2కే కిలో బియ్యం పథకం ఒకటి. ఈ పథకాన్ని ఆయన తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో ప్రారంభించారు.

రాజకీయాల్లో ఎందరికో దారిదీపం

జిల్లాలో ఎంతో మందికి రాజకీయాల్లో దారి చూపినవారు ఎన్టీయార్‌. ఎలాంటి రాజకీయ నేపధ్యం లేని సామాన్యులు కూడా ఆయన దృష్టిలో పడి ఉన్నత స్థాయికి చేరుకోవడం గమనార్హం. తిరుపతిలో చింతా మోహన్‌, కత్తుల శ్యామల, ఏ.మోహన్‌ శ్రీకాళహస్తిలో సత్రవాడ మునిరామయ్య, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, పీఆర్‌ మోహన్‌, సత్యవేడులో తలారి మనోహర్‌, సురాజ్‌, నగరిలో రాధాకృష్ణ, వి.దొరస్వామిరాజు, పుత్తూరులో గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చంద్రగిరిలో మేడసాని వెంకట్రమణనాయుడు, పీలేరులో చల్లా ప్రభాకర్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జీవీ శ్రీనాధరెడ్డి, వాయల్పాడులో చింతల సురేంద్రరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిమ్మాపురం రఘురామిరెడ్డి, మదనపల్లెలో రాటకొండ నారాయణరెడ్డి, రాటకొండ సాగర్‌రెడ్డి, ఎస్‌.పి.రాధాకృష్ణ, దొమ్మలపాటి రమేష్‌, తంబళ్ళపల్లెలో ఏవీ ఉమాశంకర్‌రెడ్డి, ఏవీ లక్ష్మిదేవమ్మ, పుంగనూరులో బగ్గిడి గోపాల్‌, కెళవాతి రామకృష్ణారెడ్డి, బషీర్‌, వాహిదున్నీసా, హైదర్‌, పలమనేరులో పట్నం సుబ్బయ్య, కుప్పంలో రంగస్వామినాయుడు, చిత్తూరులో ఎన్‌పి వీరరాఘవులు నాయుడు, ఎన్‌.పి.ఝాన్సీలక్ష్మి, దొరబాబు, హరిప్రసాద్‌, ఏఎస్‌ మనోహర్‌, వేపంజేరిలో తలారి రుద్రయ్య, ఆర్‌.గాంధీ, సూళ్ళూరుపేటలో సట్టి ప్రకాశం, మదనంబేటి మణెయ్య వంటి పలువురికి రాజకీయంగా అవకాశాలిచ్చారు. స్వంతంత్రానంతరం రాజకీయాలకు దూరంగా వున్న వెంకటగిరి రాజా కుటుంబం ఎన్టీయార్‌ చొరవతో రాజకీయాల్లోకి వచ్చింది. ఆ కుటుంబం నుంచీ తండ్రీకొడుకులు వీవీఆర్‌కే యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర ఇవురురికీ ఎన్టీయార్‌ టీడీపీ టికెట్లు కేటాయించి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేందుకు కారకులయ్యారు. వీరిలో పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి తదితర పదవులు కూడా పొందారు. పుత్తూరు నియోజకవర్గంలో సామాన్య కార్యకర్తలైన మురగయ్య, ఈశ్వరయ్యలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్టీయార్‌ వల్ల రాజకీయంగా పైకొచ్చిన వారు ఎంతో మంది వున్నారు.

అన్న కోసం ప్రాణత్యాగం చేసిన కార్మికులు!

తెలుగువారికి ఆరాధ్యుడైన ఎన్టీయార్‌ పట్ల జనం విపరీతమైన అభిమానం చూపేవారు. కేవలం అభిమానమే కాకుండా ఆయనకోసం ఏకంగా ప్రాణాలే త్యాగం చేసిన అభిమానుల గురించి ఇప్పటి తరానికి తెలియదు. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవి పోగొట్టుకున్న ఎన్టీ రామారావు పట్ల జనంలో సానుభూతి పెల్లుబికింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనం ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. స్కూళ్ళు, షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. బస్సులు తగులబడ్డాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు కూలిపోయాయి. ఆ క్రమంలో మదనపల్లె మండలం సీటీఎం గ్రామంలోని స్పిన్నింగ్‌ మిల్లు కార్మికులు భారీ విధ్వంసానికి దిగారు. ఏకంగా డీఎస్పీ వాహనంపై దాడి చేసి దాన్ని కూడా కాల్చివేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపగా ఎనిమిది మంది కార్మికులు మరణించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్టీయార్‌ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనుదీయని అభిమానులున్నారని ప్రపంచానికి చాటింది.

తమ పార్టీని ఓడించిన టీఎన్‌కి పదవి

ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించాక జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటికి హేమాహేమీలుగా వున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలెందరో ఆయన ప్రభంజనానికి గడ్డిపోచల్లా కొట్టుకుపోయారు. అంతటి ప్రభంజనాన్ని కూడా ఎదురొడ్డి తంబళ్లపల్లి నుంచీ స్వతంత్ర అభ్యర్థిగా టీఎన్‌ శ్రీనివాసులురెడ్డి సంచలన విజయం సాధించారు. ఆ ప్రాంతంలో ప్రజావసరాలకు సొంత ఆస్తులు వెచ్చించిన భూస్వామ్య కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన పట్ల ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానాలు వుండేవి. అదే ఆయన గెలుపుకు కారణమైంది. ఆయన నీతి నిజాయితీల గురించి, సేవా దృక్పధం కలిగిన ఆయన నేపధ్యం గురించి తెలుసుకున్న ఎన్టీ రామారావు తన ప్రభుత్వంలో ఆయనను ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా క్యాబినెట్‌ హోదా కలిగిన పదవిలో నియమించారు. తన పార్టీ సభ్యుడు కాకున్నా, తన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలవకున్నా కేవలం టీఎన్‌ శ్రీనివాసులురెడ్డి వ్యక్తిత్వం తెలుసుకుని అందలమెక్కించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనకు టీడీపీ ప్రభుత్వంలో పదవి స్వీకరించే నైతిక అర్హత లేదంటూ ఆ పదవిని తృణీకరించడం ద్వారా శ్రీనివాసులురెడ్డి ప్రజల్లో తన గౌరవాన్ని మరిన్ని రెట్లు పెంచుకోవడం కొసమెరుపు.

జిల్లాతో బంధుత్వం!

జిల్లాతో అనుబంధాన్నే కాకుండా జిల్లా వాసైన చంద్రబాబుకు బిడ్డనివ్వడం ద్వారా బంధుత్వాన్ని కూడా పెంచుకున్నారు ఎన్టీ రామారావు. ఆయన టీడీపీని స్థాపించక మునుపు చంద్రబాబు 1978-83 నడుమ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా వున్నపుడే ఎన్టీరామారావు తన చిన్న కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి వివాహం జరిపించారు. తద్వారా ఈ ప్రాంతంతో ఆయనకు బంధుత్వం సైతం ఏర్పడింది.

Updated Date - 2023-05-28T01:58:45+05:30 IST