హెల్మెట్‌తో బడికి...!

ABN , First Publish Date - 2023-08-22T01:14:45+05:30 IST

తలకు హెల్మెట్లు ధరించారు. డిప్యూటీ సీఎం.. మా గ్రామం చేసిన నేరమేమి? మాకు స్కూల్‌ భవనం కావాలి. జగన్‌ మామ ముద్దు.. డిప్యూటీ సీఎం వద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భవన పెచ్చులూడుతుండటంతో తలకు గాయం కాకుండా హెల్మెట్‌ వేసుకోవాల్సి వస్తుందన్నారు.

హెల్మెట్‌తో బడికి...!
హెల్మెట్‌ వేసుకుని, ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు

సన్యాసిపల్లి పాఠశాల భవనం పెచ్చులూడుతుండటంపై విద్యార్థుల వినూత్న నిరసన

పెనుమూరు, ఆగస్టు 21: తలకు హెల్మెట్లు ధరించారు. డిప్యూటీ సీఎం.. మా గ్రామం చేసిన నేరమేమి? మాకు స్కూల్‌ భవనం కావాలి. జగన్‌ మామ ముద్దు.. డిప్యూటీ సీఎం వద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భవన పెచ్చులూడుతుండటంతో తలకు గాయం కాకుండా హెల్మెట్‌ వేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇలా పెనుమూరు మండలం గంగుపల్లి పంచాయతీ సన్యాసిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులున్నారు. కొన్నేళ్లుగా ఈ భవనం మరమ్మతులకు గురైంది. వర్షమొస్తే ఉరుస్తుంది. పెచ్చులూడి పడుతున్నాయి. కొంత కాలంగా పాఠశాల ఆవరణలోని వంటగదిలోనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉందని తెలిసుకుని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌, మరికొందరు కలిసి పిల్లల చేత నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా, మండలంలో నాడు- నేడు కింద రెండు దఫాలుగా 42 పాఠశాలలకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించి పనులు చేస్తున్నారు. కానీ శిథిలావస్థకు చేరిన సన్యాసిపల్లి పాఠశాలను మాత్రం పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. ‘2019లో మా ముగ్గురు పిల్లలు ఇదే పాఠశాలలో చదివేవారు. భవనం శిథిలావస్థలోకి చేరుకోవడంతో వారిని చిత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నా. అదే సమయంలో 20 మంది పిల్లలున్న ఈ పాఠశాలలో ఏటా తగ్గుతూ ప్రస్తుతం ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది’ అని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ రవి పేర్కొన్నారు. కాగా, సాయంత్రం సన్యాసిపల్లి పాఠశాలను నారాయణస్వామి పరిశీలించారు. స్కూల్‌ భవనం పూర్తిగా పాడైపోవడంతో అప్పుడే కలెక్టరుకు ఫోన్‌ చేసి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2023-08-22T01:14:45+05:30 IST