వైభవం.. గోవిందుడి రథోత్సవం

ABN , First Publish Date - 2023-06-03T01:43:27+05:30 IST

తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో తిరుపతి ప్రధాన వీధులు మార్మోగాయి.

వైభవం.. గోవిందుడి రథోత్సవం
రథాన్ని లాగుతున్న భక్తులు

తిరుపతి(కల్చరల్‌) జూన్‌ 2: తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో తిరుపతి ప్రధాన వీధులు మార్మోగాయి. రథంపై మిరియాలు, ఉప్పు చల్లి పలువురు మొక్కులు తీర్చుకున్నారు. వేసవి కావడంతో రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు టీటీడీ యంత్రాంగం మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేసింది. కర్ణాలవీధి, బేరివీధి, గాంధీ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లో రథం వెళుతున్నపుడు నగరవాసులు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రథోత్సవానికి అనువుగా ఆలయ మాడవీధుల్లో ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అలాగే మున్సిపల్‌ ఉద్యోగులు వీధులను శుభ్రం చేశారు. ఉదయం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో గోవిందుడు కనువిందు చేశాడు. ఈ కార్యక్రమంలో జీయర్‌ స్వాములు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో రవికుమార్‌, ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు మోహన్‌రావు, నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు ధనంజయులు, రాధాకృష్ణ, అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

నేడిలా..

శనివారం ఉదయం ఆరు నుంచి 7.30 గంటల వరకు గోవిందుడు ఉభయనాంచారులతో కపిలతీర్థం (ఆళ్వారుతీర్థం) వేంచేస్తారు. 8-9.30 గంటల మధ్య చక్రస్నానం జరుగుతుంది. ఉత్సవర్లు సాయంత్రం తిరిగి ఆలయం చేరుకుంటారు. రాత్రి ఏడు నుంచి 8.30 గంటల మధ్య గోవిందరాజస్వామి, చక్రత్తాళ్వారుల ఊరేగింపు ఉంటుంది. 8.40 నుంచి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Updated Date - 2023-06-03T01:43:27+05:30 IST