Share News

నేత్రానందం.. పుష్పయాగం

ABN , First Publish Date - 2023-11-20T01:57:30+05:30 IST

తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఆదివారం పుష్పయాగాన్ని నేత్రానందంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు, అర్చకుల వల్ల తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణార్థం ఈ యాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

నేత్రానందం.. పుష్పయాగం

తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఆదివారం పుష్పయాగాన్ని నేత్రానందంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు, అర్చకుల వల్ల తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణార్థం ఈ యాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి/తిరుచానూరు

తిరుమలలో..

శ్రీవారికి దాతలు సమర్పించిన పుష్పాలు, పత్రాలకు ఉదయం తిరుమలలోని టీటీడీ గార్డెన్‌ విభాగంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వీటిని గంపల్లో ఉంచి ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, శ్రీవారి సేవకులు, భక్తులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు. తనిఖీలయ్యాక ఆలయంలోకి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో వేంచేపు చేసి, స్నపన తిరుమంజనాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పుష్పయాగాన్ని ప్రారంభించారు. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో ఉత్సవర్లను అర్చకులు 20 సార్లు అర్చించారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొని నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పుష్పయాగానికి ఎనిమిది (తమిళనాడు నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు, తెలుగు రాష్ర్టాల నుంచి రెండు) టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు. దాతల నుంచి పుష్పాల సేకరణకు కృషి చేసిన గార్డెన్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులును పారుపత్తేదార్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి సన్మానించారు.

తిరుచానూరులో..

పద్మావతి అమ్మవారి పుష్పయాగానికి మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి దాతలు సమర్పించిన మూడు టన్నుల పుష్పాలకు, పత్రాలకు మధ్యాహ్నం ఆస్థాన మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వీటిని గంపల్లో ఉంచి అధికారులు, భక్తులు తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఇక ఉదయం అమ్మవారికి శ్రీకృష్ణ ముఖ మండపంలో స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీకృష్ణ ముఖ మండపంలో బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఐదు గంటలకు పుష్పయాగాన్ని ప్రారంభించారు. 12 రకాల పుష్పాలతో అమ్మవారిని అర్చకులు అర్చించారు. ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈవో రమే్‌ష్‌, ఏవీఎస్వో శైలేంద్రబాబు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠ స్వామి, సూపరింటెండెంట్లు మధు, శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. మంగళవారం నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-20T01:57:32+05:30 IST