భీతావహం

ABN , First Publish Date - 2023-06-01T01:54:43+05:30 IST

చుట్టూ పచ్చని పొలాలు.... మేతమేస్తున్న మూగజీవాలు.... మధ్యాహ్నం ఎండధాటికి అలసి నడుం వాల్చిన వారు కొందరైతే.... రచ్చబండ వద్ద పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న మరి కొంతమంది. ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం. ఏం జరిగిందో తెలియక శబ్దం వచ్చిన పొలాల్లోని టపాసుల గోడౌన్‌ వైపు పరుగులెట్టారు. పేలుళ్లు , మంటలతో భీతావహంగా వున్న అక్కడి దృశ్యాలను చూసి భయపడిపోయారు.చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, దేహాల నుండి తెగి వేరుగా పడిన శరీర భాగాలు, రక్తసిక్తంగా మారిన పరిసరాలతో భయానక వాతావరణం చూసి నిశ్చేష్టులైపోయారు.

భీతావహం
టపాకాయల గోదాము

ఎల్లకట్టవ కన్నీటిసంద్రం

చుట్టూ పచ్చని పొలాలు.... మేతమేస్తున్న మూగజీవాలు.... మధ్యాహ్నం ఎండధాటికి అలసి నడుం వాల్చిన వారు కొందరైతే.... రచ్చబండ వద్ద పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న మరి కొంతమంది. ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం. ఏం జరిగిందో తెలియక శబ్దం వచ్చిన పొలాల్లోని టపాసుల గోడౌన్‌ వైపు పరుగులెట్టారు. పేలుళ్లు , మంటలతో భీతావహంగా వున్న అక్కడి దృశ్యాలను చూసి భయపడిపోయారు.చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, దేహాల నుండి తెగి వేరుగా పడిన శరీర భాగాలు, రక్తసిక్తంగా మారిన పరిసరాలతో భయానక వాతావరణం చూసి నిశ్చేష్టులైపోయారు.గోడౌన్‌నుంచి మంటలు వస్తుండడంతో ఇంకా లోపల నల్లమందు వుండి పేలుతుందన్న భయంతో దూరదూరంగానే చాలాసేపు వుండిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పిన తర్వాతే మృతులను, క్షతగాత్రులను గ్రామస్తులు గుర్తించగలిగారు.

వరదయ్యపాళెం, మే 31 : వరదయ్యపాళెం మండలం సాతంబేడు పంచాయతీ ఎల్లకట్టవ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం 3గంటల సమయంలో టపాకాయల గోడౌన్‌లో జరిగిన పేలుళ్లు గ్రామస్తులను భయభ్రాంతులను చేశాయి.ఈ ప్రమాదంలో గ్రామానికే చెందిన ఇద్దరితో పాటు గూడూరువాసి ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.ఎల్లకట్టవకు చెందిన వీరరాఘవ అలియాస్‌ వీరయ్య (38) గ్రామ శివారులో టపాసుల తయారీ కేంద్రాన్ని ఐదేళ్ళుగా నిర్వహిస్తున్నాడు.గూడూరుకు చెందిన ఏడుకొండలు (42), ఎల్లకట్టవ గ్రామానికే చెందిన కళ్యాణ్‌ (28), నాగేంద్ర (26), శంకరయ్య (35)ఇక్కడ పని చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గ్రామ దేవతల జాతరలు ఎక్కువగా జరుగుతుండడంతో టపాసులకు డిమాండ్‌ ఏర్పడింది. ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గోదాము వెలుపల పందిరి లాంటి పూరిపాకలో ఇద్దరు, గోదాములో ఒకరు టపాసులు తయారు చేస్తుండగా యజమాని వీరయ్య, వలంటీర్‌ కళ్యాణ్‌ కాస్త దూరంలో చెట్ల కింద సేద దీరుతూ వున్నారు. సుమారు 3 గంటల సమయంలో పూరిపాకలో పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు పూరిపాకతో పాటు పక్కనే వున్న మూడు బైక్‌లకు కూడా మంటలు అంటుకోవడంతో అవి పేలిపోయాయి.ఆ తీవ్రతకు పూరిపాక నుంచీ నిప్పులు ఎగిసి గోదాములో పడడంతో అక్కడి టపాసులు కూడా పేలిపోయాయి. పేలుడు, మంటల ధాటికి గోదాములో ఒకరు, పూరిపాక కింద వున్న మరో ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా వారి మృతదేహాలు 20 అడుగుల దూరానికి ఎగిరి పడ్డాయి. ముగ్గురి శరీరాలూ ఛిద్రమయ్యాయి. కొన్ని శరీర భాగాలు తెగి దూరంగా పడ్డాయి. మృతులను శంకరయ్య, నాగేంద్ర, ఏడుకొండలుగా గుర్తించారు. దూరంగా చెట్ల కింద సేదతీరుతుండిన వీరయ్య, కళ్యాణ్‌ సైతం మంటలతో తీవ్రంగా గాయపడ్డారు.టపాసుల తయారీ కేంద్రం వద్ద జరిగిన పేలుడుతో ఆ ప్రదేశం భీతావహంగా మారింది. ప్రమాద స్థలిలో చెల్లాచెదురుగా మూడు మృత దేహాలు పడి వున్నాయి. ఓ మృతదేహం ముఖం ఛిద్రమై రెండుగా చీలిపోయింది. నడుము నుంచీ కింది భాగం తెగిపోయి ఓ చోట ముద్దగా పడివుంది. మరో మృతదేహం ముఖం గుర్తు పట్టలేని విధంగా మాంసపు ముద్దలా మారింది. కుడిచేయి పూర్తిగా తెగి మరో చోట పడింది. కుడి మోకాలి కింది భాగం తెగిపోగా, ఎడమ కాలు ఛిద్రమైంది. ఇంకో మృతదేహానికి కుడి కాలు సగం తెగి మాంసం ముద్దలా మారగా ఎడమ కాలు సైతం ఛిన్నాభిన్నమైంది. గ్రామానికి దూరంగా పంట పొలాల్లో టపాసుల తయారీ కేంద్రం వుండడంతో ప్రమాదం జరిగినపుడు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరూ లేరు. పేలుడు శబ్దం విని దూరంగా పంటపొలాల్లో వున్న వారు, గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. వరదయ్యపాళెం పోలీసులకు, సూళ్లూరుపేట ఫైర్‌ స్టేషనుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.మృతదేహాలను సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మృతుల కుటుంబీకులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాకే శవాలను తరలించండని అడ్డుకున్నారు.సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున రెడ్డి వారికి నచ్చజెప్పారు.ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.గాయపడిన వీరయ్య, కళ్యాణ్‌లను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో చంద్రముని, డీఎస్పీ శ్రీనివాస రావు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు.టపాసుల తయారీ కేంద్రాన్ని భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం టపాసుల తయారీ, నిల్వ, అమ్మకాలకు ప్రభుత్వ అనుమతులు వున్నాయని, గత నెల 10వ తేదీతో లైసెన్సు గడువు ముగియగా రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెబుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందో తెలియట్లేదు

ప్రమాదస్థలం గందరగోళంగా ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందో అగ్నిమాపక శాఖ సాంకేతికంగా గుర్తించ లేకపోయింది. గాయపడిన వీరయ్య, కల్యాణ్‌ కోలుకున్న తరువాత అసలు కారణాలు వెలుగులోకి రావచ్చు. మరోవైపు క్లూస్‌టీముకు సమాచారం అందించాం. గురువారం క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే కొన్ని వివరాలైనా తెలిసే అవకాశముంది.

- ఆర్డీవో చంద్రముని

Updated Date - 2023-06-01T01:54:43+05:30 IST