Share News

ఉత్సాహంగా బాలోత్సవం

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:30 AM

బడి పిల్లల సృజనాత్మక శక్తికి పదును పెట్టే కళావేదిక బాలోత్సవం శనివారం తిరుపతిలో ప్రారంభమైంది. వరుసగా రెండవ యేడాది నిర్వహిస్తున్న ఈ బాలోత్సవం నెహ్రూ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో కోలాహలంగా మొదలైంది.

ఉత్సాహంగా బాలోత్సవం
నృత్య పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు

తిరుపతి(కల్చరల్‌) డిసెంబరు 16: బడి పిల్లల సృజనాత్మక శక్తికి పదును పెట్టే కళావేదిక బాలోత్సవం శనివారం తిరుపతిలో ప్రారంభమైంది. వరుసగా రెండవ యేడాది నిర్వహిస్తున్న ఈ బాలోత్సవం నెహ్రూ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో కోలాహలంగా మొదలైంది. ఆదివారం కూడా జరగనున్న ఈ బాలల కళాసాంస్కృతిక, వైజ్ఞానిక, సృజనాత్మక ఉత్సవంలో తిరుపతి, పరిసరప్రాంతాల పాఠశాలల పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాలుగు విభాగాలలో 29 అంశాలలో ఈ యేడాది పిల్లలకు పోటీలు నిర్వహించగా దాదాపు ఐదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి బాలోత్సవ పతాకావిష్కరణ చేసి, పాఠశాల ఆవరణలోని భ నెహ్రూ విగ్రహానికి పూలమాలవేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నతనంలోనే తమలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టుకునే అవకాశం విద్యార్థులకు ఇటువంటి పోటీల్లో పాల్గొనడం వలన వస్తుందన్నారు.తొలి రోజు సీనియర్స్‌, జూనియర్స్‌, సబ్‌- జూనియర్స్‌, ఎల్‌కేజీ నుంచి 2వ తరగతి వరకు అనే విభాగాల్లో విద్యాసంబంధమైనవి, హస్తకళలు, సాంస్కృతికాంశాలు, క్రీడలు అనే విభాగాలలో చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, స్పెల్‌ బి, పద్యం-భావం, ఏకపాత్రాభినయం, జానపద నృత్యం, శాస్ర్తీయ సంగీతం, యోగ, చెస్‌, విచిత్ర వేషధారణ, టైక్వాండో వంటి 29 అంశాలలో పలు వేదికలపై పోటీలు జరిగాయి.వ్యాసరచన, టైక్వాండో, మేప్‌ పాయింటింగ్‌ వంటి పలు ఆంశాల్లో శనివారమే బహుమతులు పంపిణీ చేయగా, కధా రచన వంటి కొన్ని అంశాలకు, ఆదివారం నిర్వహించే పోటీలకు ఆదివారం సాయంత్రం సభలో బహుమతులు అందజేస్తారు. కాగా శనివారం సాయంత్రం జరిగిన సభలో టీటీడీ విద్యాఽశాఖాధికారి డాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి, ప్రముఖ న్యాయవాది మట్టా పురుషోత్తమ రెడ్డి, వ్యాపారవేత్త ఊకా విజయకుమార్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొని తొలి రోజు విజేతలకు బహుమతులు పంచి పెట్టారు. బాలోత్సవ కమిటీ సభ్యులు మల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, సాకం నాగరాజు, నడ్డి నారాయణ, ఆకుల మల్లేశ్వరరావు, ఆర్సీ కృష్ణస్వామి రాజు, తమటం రామచంద్రా రెడ్డి, నెమిలేటి కిట్టన్న, యువశ్రీ మురళి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 10 నుండి సాయంత్రం నాలుగు గంటలవరకు రెండవ రోజు పోటీలు జరగనున్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 01:30 AM