స్పందన లేదన్నా.. వచ్చారు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:41 PM
కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం లేదని చెప్పినా అర్జీదారులు హాజరయ్యారు. బాధితుల నుంచి డీఆర్వో రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు వినతిపత్రాలను స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న అర్జీదారులు
వినతులను స్వీకరించిన అధికారులు
చిత్తూరు, డిసెంబరు 18: కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం లేదని చెప్పినా అర్జీదారులు హాజరయ్యారు. బాధితుల నుంచి డీఆర్వో రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు వినతిపత్రాలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీల్లో కొన్ని..
56 కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు తక్షణం నిధులు మంజూరు చేయాలంటూ బీజేపీ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు పదవుల కోసమే 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీసీ ఉపకులాలకు చెందిన 18ఉప కులాలకు వారికి కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలకు, వలంటీర్లకు మాత్రమే ఆ రుణాలను ఇచ్చిందన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఆ ప్రతులను బీజేపీ కార్యాలయంలో ఇస్తే రుణాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను రద్దు చేయాలని చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి, కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల రైతులకు జరిగిన అన్యాయంపై న్యాయం పొందడానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. భూహక్కుదారుడికి అన్యాయం జరిగితే రెవెన్యూ అధికారిని ఆశ్రయించాలి తప్ప కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండదన్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థఅని, అన్యాయం జరిగిన వారికి నిష్పక్షపాతంగా న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. తక్షణ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు.
వ్యవసాయ భూములివ్వండి
మాకు కూలి పనులే జీవనాధారం. దీనివల్ల చాలీచాలని బతుకులు బతుకుతున్నాం. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ భూములు ఇవ్వండి అంటూ ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్ల ఎస్టీ కాలనీకి చెందిన వారు కోరారు. ఈ కాలనీలో 50 కుటుంబాలున్నాయి. తాము డబ్బిచ్చి భూములు కొనుక్కునే పరిస్థితుల్లో లేమని వారు చెప్పారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన తవకుఉ వ్యవసాయ భూములివ్వాలని విజ్ఞప్తి చేశారు.
వికలాంగ పెన్షన్ ఇచ్చి ఆదుకోండి
తమ కుమారుడికి వికలాంగ పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని పుంగనూరు మండలం మాగాండ్లపల్లెకు సుబ్బన్న, మునెమ్మ దంపతులు కోరారు. తమ 13 ఏళ్ల కుమారుడు ఉమాశంకర్‌కు బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగుడని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అధికమొత్తంలో డబ్బులు ఖర్చవుతోందన్నారు. కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్న నెలనెలా డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడికి రూ.5 వేలు పెన్షన్ ఇప్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
పోలీసు స్పందనకు 31 ఫిర్యాదులు
పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 31 మంది అర్జీదారులు హాజరై అధికారులకు సమస్యలను వివరించారు. బాధితుల నుంచి ఏఎస్పీ సుధాకర్, శ్రీలక్ష్మి వినతిపత్రాలను స్వీకరించారు. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీల్లో భూ తగాదాల కింద 11, కుటుంబ తగాదాలు 7, వేధింపులు 5, ఇంటి తగాదాలు 6, డబ్బు తగాదాల కింద 2 చొప్పున వినతిపత్రాలు అందాయి.