ఉత్సాహంగా ముందుకు

ABN , First Publish Date - 2023-02-02T00:52:20+05:30 IST

యువగళం’ వినిపించడానికి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేశ్‌కు.. స్థానికులూ చేయి అందించారు.

ఉత్సాహంగా ముందుకు

లోకేశ్‌ పాదయాత్రకు జన నీరాజనం

‘యువగళం’ వినిపించడానికి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేశ్‌కు.. స్థానికులూ చేయి అందించారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. బైరెడ్డి పల్లె మండలం నుంచి పలమనేరు సమీపం వరకు బుధవారం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. బైరెడ్డిపల్లె మండలం బురిశెట్టిపల్లి పల్లె క్రాస్‌ వద యువకులు పాదయాత్రికుడి కోసం రోడ్డుపై చెండుమల్లి పూలు పరిచారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులిచ్చారు. యువత, టీడీపీ అభిమానులు పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ప్రతిచోట లోకేశ్‌ ఓపిగ్గా స్థానికులతో సంభాషిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదిలారు. సెల్ఫీలు ఇచ్చారు. గ్రామీణప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు, యువకులు, రైతులు తదితరులు తమ ప్రాంతంలో పాదయాత్రలో నడుస్తూ మద్దతుగా నిలిచారు. ఎలాంటి అలసట లేకుండా అందరికంటే చలాకీగా లోకేశ్‌ నడుస్తుండడంతో పార్టీశ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పాదయాత్ర మధ్యలో పలు సంఘాలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఆయా సంఘాలకు జగన్‌ ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చకుండా మోసం చేయడంపై సభలో చర్చించారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు. వైసీపీ దాడులకు దీటుగా ఆయన కొలమాసనపల్లెలో ఇచ్చిన హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. తమ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్డార్‌ అంటూ లోకేశ్‌ అనగానే బిగ్గరగా యువత కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. కుప్పం- పలమనేరు ప్రధాన రహదారి మీదుగా పాదయాత్ర సాగుతుండగా, రోడ్డుపై వున్న గ్రామాల వద్దకు ఇతర ప్రాంతాల నుంచీ జనం వచ్చి స్వాగతం పలికారు.

- పలమనేరు

Updated Date - 2023-02-02T00:52:21+05:30 IST