యువ ఓటర్ల నమోదు సంతృప్తికరం
ABN , Publish Date - Dec 23 , 2023 | 02:03 AM
జిల్లాలో యువ ఓటర్ల నమోదు సంతృప్తికరంగా ఉందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 22: జిల్లాలో యువ ఓటర్ల నమోదు సంతృప్తికరంగా ఉందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై శుక్రవారం చిత్తూరులో ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన డీఆర్వో రాజశేఖర్‌తో కలిసి ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలోఆయన మాట్లాడారు. స్వీప్ యాక్టివిటీ్‌సని ముమ్మరంగా నిర్వహించి 19,448 మందిని నూతనంగా నమోదు చేయడం అభినందనీయమన్నారు. డిసెంబరు 9 వరకు అందిన క్లైయిమ్‌లన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఎపిక్ కార్డుల ముద్రణ, పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు నమోదు, సవరణలు, తుదిజాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 15,45,666 ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో 763671 మంది పురుషులు, 781887 మంది స్త్రీలు, 108 మంది ట్రాన్స్‌జెండర్స్, 3486 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వివరించారు. జనవరి 5న తప్పుల్లేని తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ భవాని, చిత్తూరు, నగరి, పలమనేరు ఆర్డీవోలు చిన్నయ్య, సుజన, మనోజ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ప్రతినిధులు గౌనివారి శ్రీనివాసులు, కోదండయ్య, కాంగ్రెస్ నుంచి పరదేశి, బీజేపీ నుంచి జగదీశ్వర్‌నాయుడు, శ్రీనివాసులు, బీఎ్‌సపీ నుంచి భాస్కర్, ఆమ్‌ఆద్మీ నుంచి లోకేశ్, సూపరింటెండెంట్ బ్యూలా, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
బూత్‌లవారీగా ఓటరు నమోదు,
సవరణ వివరాలివ్వండి
చిత్తూరు సిటీ: ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఓటరు నమోదు, సవరణ వివరాలు ఇవ్వాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ కోరారు. ఈ మేరకు చిత్తూరులో జరిగిన సమావేశంలో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. గడచిన మూడు నెలల కాలంలో ఫారం 6,7,8 జిల్లా వ్యాప్తంగా పెట్టుకున్న క్లైములు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుపై వచ్చిన అన్ని వివరాలు గ్రామ స్థాయిలోని పోలింగ్ బూత్ వారీగా అధికారులు సవరించిన జాబితాను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారా?
కల్లూరు: జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రోల్ పరిశీలకుడు పోలా భాస్కర్ శుక్రవారం పరిశీలించారు. పులిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించారా అని బీఎల్వోలు సురేష్, సిద్దయ్యను అడిగారు. బీఎల్వోలు చేపట్టిన ఇంటింటా సర్వే, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ, ర్యాండమ్ చెకింగ్, నోటీసులు, ఆర్డర్స్ తదితరాలను జేసీ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. స్త్రీ, పురుషుల ఓటర్ల నిష్పత్తి, రెండు శాతం కంటే అధికంగా ఓట్ల తొలగింపు, నాలుగు శాతం కంటే అధికంగా మార్పులు, చేర్పులు జరగడం, ఇంటింటా సర్వే, జీరో డోర్ నెంబర్ల గుర్తింపు తదితరాల గురించి బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, పులిచెర్ల, రొంపిచెర్ల తహసీల్దార్లు శేషగిరిరావు, అమర్‌నాథ్, ఎంపీడీఓ రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే, పూతలపట్టు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని, చిత్తూరు నగరం కట్టమంచి నగరపాలక పాఠశాలలోని 18, 19 పోలింగ్ కేంద్రాలను పోలా భాస్కర్ తనిఖీ చేశారు. అక్కడి బీఎల్వోలతో మాట్లాడారు.