Share News

పాన చెరువును చెరబట్టారు

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:45 AM

తిరుపతిలోని గెస్ట్‌లైన్‌ డేస్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు (అన్నమయ్య మార్గం) భూ ఆక్రమణదారులకు అడ్డాగా మారుతోంది. ప్రభుత్వ భూమైనా, మఠం స్థలమైనా ఖాళీగా కనిపిస్తే చాలు చదును చేసి చకచకా తాత్కాలిక గదులు వేసేసుకుంటున్నారు. తాజాగా అక్కడున్న పాత (పాన) చెరువునూ చెరబట్టారు.

పాన చెరువును చెరబట్టారు
చెరువులో జరుగుతున్న నిర్మాణాలు

తిరుపతి, ఆంధ్రజ్యోతి: అన్నమయ్య మార్గంలో ప్రస్తుతం శరవేగంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకూ స్వర్గధామంగా మారింది. దీన్నే ఆక్రమణదారులు.. కల్పతరువుగా మార్చుకున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే వదలడం లేదు. ఈ క్రమంలోనే పాన చెరువునూ ఆక్రమించేశారు. పక్కనున్న పట్టాభూముల్లోని సర్వే నెంబరుతో రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నట్టు తెలిసింది. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు నుంచి లోపలికి కనపడకుండా గేట్లు వేసి మరీ చెరువు స్థలాన్ని చదునుచేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతోనే ఈ భూ దందా సాగుతోందని నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు స్థలం అన్యాక్రాంతమవుతోందని గుర్తించారు. ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలని జూన్‌ 27న అర్బన్‌ తహసీల్దార్‌కు లేఖ రాశారు.

రోడ్డు నిర్మాణ సమయంలోనూ విమర్శలు

‘ఈ మార్గంలో వైసీపీకి చెందిన ఒక సామాజికవర్గ ప్రముఖుల స్థలాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఎటు కావాలంటే అటు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు నిర్మించుకున్నారు’ అన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఎందుకీ మౌనం?

తిరుపతి అర్బన్‌ తిమ్మినాయుడుపాళెం రెవెన్యూ లెక్కదాఖలా కొత్తపల్లె గ్రామ సర్వేనెంబరు 80/2లో 2.93 ఎకరాలు చెరువుగట్టుకు చెందిన ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. సర్వేనెంబరు 84లో 49.40 ఎకరాల విస్తీర్ణంతో పాత చెరువు అలియాస్‌ పానచెరువు ఉంది. 83/1ఏలో 8 సెంట్లు, 83/2ఏలో 14 సెంట్లు కూడా చెరువుకట్ట కిందే ఉన్నాయి. వందలాది ఎకరాలకు ఆయకట్టుగా పాతచెరువు ఉండేది. తాజాగా భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో ఆక్రమణదారులు చెరువు గట్టుపై పడ్డారు. చెరువుకు పక్కన ఉన్న పట్టా భూమి సర్వే నెంబరుతో ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.25కోట్ల విలువ కలిగిన భూమి గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు మౌనం దాల్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆక్రమణలు నిజమే

పాత (పాన) చెరువు స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించాం. సర్వేచేసి ఆక్రమణలను తొలగించి, చెరువును రక్షించాలని రెవెన్యూ అధికారులకు పలుసార్లు లేఖలు కూడా రాశాం. ఆర్డీవో, కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం. సర్వే జరిగితే ఎంత ఆక్రమణలకు గురైందో స్పష్టత వస్తుంది.

- ఆర్‌ఎంవీ రమణమూర్తి, ఏఈ, నీటిపారుదల శాఖ, తిరుపతి అర్బన్‌

Updated Date - Dec 31 , 2023 | 12:45 AM