శ్రీకాళహస్తిలో భూమాయలు!
ABN , First Publish Date - 2023-03-02T00:38:01+05:30 IST
శ్రీకాళహస్తిలో భూకబ్జాలకు అంతేలేకుండా పోతోంది. కబ్జాలు చేసిన స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం....ఆపై అమ్మి సొమ్ముచేసుకోవడం మాములైపోయింది.శరవేగంగా విస్తరిస్తున్న శ్రీకాళహస్తిలో ఇళ్ల స్థలాలకు విపరీతమైన డిమాండ్ వుంది.
తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తిలో భూకబ్జాలకు అంతేలేకుండా పోతోంది. కబ్జాలు చేసిన స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం....ఆపై అమ్మి సొమ్ముచేసుకోవడం మాములైపోయింది.శరవేగంగా విస్తరిస్తున్న శ్రీకాళహస్తిలో ఇళ్ల స్థలాలకు విపరీతమైన డిమాండ్ వుంది.ఈ నేపథ్యంలో వైసీపీ నేతల దృష్టి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌పై పడింది. 2005వ సంవత్సరంలో ఇక్కడ 6వేలకు పైగా ఇళ్లపట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పట్లో చాలామంది లబ్ధిదారులు వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి పట్టాలు లేని ఇళ్లస్థలాలను, పట్టాలుండి లబ్ధిదారులు లేని స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంది.దీంతో సుమారు 4వేల ప్లాట్లు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి.వైసీపీ సర్కారు ఏర్పడ్డాక ఆ పార్టీ నేతలు రాజీవ్‌నగర్‌లో అందినకాడికి స్థలాలను అమ్ముకుంటూ వచ్చారు. ఇక మూడువేల స్థలాలు మిగిలాయి. వీటిని కూడా పథకం ప్రకారం అయినవారందరికీ పంచేసే పనులు ప్రారంభించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకే కాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే తమకు అనుకూలమైన వారందరికీ కూడా ప్లాట్లను బినామీ పేర్లతో బుధవారం ధారాదత్తం చేశారు.ఇందుకోసం ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చి పలువురికి పాత తేదీలతో పట్టాలు అందజేసినట్లు సమాచారం. గత యేడాది ఫిబ్రవరి 25వ తేదీన పట్టాలు ఇచ్చినట్లు అందులో పొందుపరిచారు.ఇటీవల రూ.3లక్షల చొప్పున ఒక్కో ప్లాటును కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించి అమ్ముకున్నారు.ఈ లెక్కన ఈ మూడువేల ప్లాట్ల విలువ రూ.90కోట్లు. ఇదంతా తెలిసే జరుగుతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోకపోవడమే అసలైన విషాదం.
ఓటీఎస్ పేరుతో భారీ స్కామ్‌కు తెర
పట్టణ శివారులో శివనాథపాళెం వద్ద గత ప్రభుత్వం సుమారు 6,100 ఎన్టీఆర్ గృహాలను నిర్మించింది. ఈ అపార్ట్‌మెంట్లకు వెనుకవైపున ఇటీవల గిరిప్రదక్షిణ(దేవునిబాట) సీసీరోడ్డును నిర్మించారు. అటు అపార్ట్‌మెంట్లు, ఇటు 40 అడుగుల సీసీరోడ్డు పడటంతో ఈ మార్గంలో భూములపైనా అధికార పార్టీ నేతలు కన్నేశారు. మూడు రోజుల నుంచి ఏడు ఎకరాలను గుట్టుచప్పుడు కాకుండా చదును చేసేశారు. రెండు రోజుల్లో ప్లాట్లు వేయాలన్నది వారి ప్రణాళిక.సుమారు రూ.20కోట్ల విలువైన ఈ స్థలంలో ప్లాట్లకు పాత తేదీలతో పట్టాలు సృష్టించి ఓటీఎస్ స్కీమ్ కింద బేరాలు పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. పాత ఎంజాయ్‌మెంటు పట్టాలతో ఓటీఎస్ రిజిస్ర్టేషన్ చేసి తర్వాత ప్రైవేటు వ్యక్తులకు ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రహదారి పక్కనే...
రాజీవ్‌నగర్‌లో పిచ్చాటూరు రహదారి పక్కనే పనసకాలువ ప్రవహిస్తోంది. అప్పట్లో కాలువ భూమి కావడంతో ఈ రోడ్డు పక్కన ప్లాట్లు వేయకుండా వదిలిపెట్టారు. అయితే విలువ పెరిగిన నేపథ్యంలో ఇటీవల రహదారికి ఆనుకుని సుమారు 25ప్లాట్లను వేసి ఆగమేఘాలపై నిర్మాణాలు చేపట్టారు. వాణిజ్య దుకాణాలుగా మార్చి అమ్ముకుంటున్నారు. దీని విలువ సుమారు రూ.4కోట్లుగా అంచనా వేస్తున్నారు.
కులసంఘం పేరుతో....
కులసంఘం పేరుతో కూడా రాజీవ్‌నగర్‌లో వైసీపీ నాయకులు భూముల దోపిడీకి పాల్పడుతున్నారు. 25ఏళ్ల క్రితం అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నాయీబ్రాహ్మణుల కోసం 169 ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే పలువురు తమకు న్యాయం జరగలేదనడంతో నిర్మాణాలకు అనుమతించలేదు. ఇటీవల ఆ స్థలం వద్ద ముక్కంటి ఆలయ దేవుని బాట రోడ్డు నిర్మించారు. 40అడుగుల సిమెంట్ రోడ్డు నిర్మించడంతో అమాంతంగా ధరలు పెరిగాయి. దాదాపు రూ.5కోట్లుగా అంచనా వేస్తున్న ఈ స్థలంలోకి వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న కొందరు కులసంఘ నాయకులతో రంగంలోకి దిగారు. మీకు సగం మాకు సగం అంటూ యధేచ్చగా అక్రమ నిర్మాణాలను సాగిస్తున్నారు.