డీఆర్డీవో ప్రాజెక్టు రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలి: జేసీ

ABN , First Publish Date - 2023-03-24T01:01:02+05:30 IST

రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన డీఆర్డీవో ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులో రహదారి నిర్మాణాల కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహించాలని జేసీ వెంకటేశ్వర్‌ తెలిపారు.

డీఆర్డీవో ప్రాజెక్టు రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలి: జేసీ
అధికారులతో సమీక్షిస్తున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 23: రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన డీఆర్డీవో ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులో రహదారి నిర్మాణాల కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహించాలని జేసీ వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి రోడ్డు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, డీఆర్డీవో అధికారుల నిర్ణయం మేరకు రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూన్‌ 1 నాటికి రహదారి నిర్మాణానికి స్థల అప్పగింత చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, డీఆర్డీవో అధికారి హేమరాజశర్మ, ఆర్డీవో రేణుక, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ అధికారులు పాల్గొన్నారు.

వేగంగా చిత్తూరు - తచ్చూరు భూసేకరణ పనులు

చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారికి సంబంధించిన పనులను వేగంగా పూర్తిచేసి అప్పగించాలని జేసీ వెంకటేశ్వర్‌ అన్నారు. జాతీయ రహదారికి సంబంధించి పెండింగ్‌లో వున్న భూసేకరణ పనుల అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, శ్రీరంగరాజపురం, నగరి, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పెండింగ్‌లో వున్న భూసేకరణ పనులు వేగవంతంగా నిర్వహించేందుకు అధికారులు చొరవచూపాలన్నారు.

జాతీయ రహదారుల పనులు త్వరగా చేయండి

జిల్లా అభివృద్ధికి తోడ్పడే జాతీయ రహదారుల నిర్మాణపనులను వేగవంతం చేయాలని జేసీ వెంకటేశ్వర్‌ అన్నారు. గురువారం జేసీ చాంబర్‌లో ఎన్‌హెచ్‌ 71, పీలేరు - కాలూరు రోడ్డు పనులకు సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రొంపిచెర్ల మండలం బొంబాయిగారిపల్లి, బండకిందపల్లి, పెద్దగొట్టిగల్లు, సదుం మండలం ఊటుపల్లెల్లో పెండింగ్‌లో వున్న ఎన్‌హెచ్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వీటిపై తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో చిత్తూరు ఆర్డీవో రేణుక, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, మురళి, పులిచెర్ల తహసీల్దార్‌ అమర్‌నాథ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-24T01:01:02+05:30 IST