ఆ తప్పు జరగనీయొద్దు

ABN , First Publish Date - 2023-03-26T01:00:11+05:30 IST

జిల్లాలో గత ఏడాది నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆ తప్పు జరగనీయొద్దు

- గత ఏడాది ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో జిల్లాకు మచ్చ

- ఈ దఫా సమస్యాత్మక కేంద్రాలపై అధికారుల ప్రత్యేక దృష్టి

చిత్తూరు, ఆంధ్రజ్యోతి/చిత్తూరు సెంట్రల్‌, మార్చి 25: జిల్లాలో గత ఏడాది నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఐదుగురు ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధుల్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈసారి అటువంటి తప్పు జరగనీయకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గతంలో ఏం జరిగిందంటే..

జీడీనెల్లూరు మండలం నెల్లేపల్లె పరీక్ష కేంద్రంలో నుంచి ఇన్విజిలేటర్‌ కాని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బయటి నుంచి కేంద్రం లోపలికి వచ్చి తెలుగు ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకున్నాడు. ఆ ప్రశ్నపత్రం సర్కిల్‌ అవుతూ పలు ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లింది. చిత్తూరుకు చెందిన ఓ వాట్సాప్‌ గ్రూపులో ప్రైవేటు విద్యాసంస్థ ప్రతినిధి ఒకరు దాన్ని పోస్టు చేసి, మళ్లీ డిలీట్‌ చేశారు. దాని ఆధారంగా పోలీసులు విచారించి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ఐదుగురు ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులను అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లను జైలుకు పంపారు. తొలుత పేపర్‌ లీకేజీ వరకే అధికారులు దృష్టి సారించినా, చివరికి దానికి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఇందులోకి ఉద్దేశపూర్వకంగా లాక్కొచ్చి మరీ ఇరికించారనేది బహిరంగ సత్యమే. ఫైనల్‌గా ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాపై మచ్చ పడింది.

సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

సమస్యాత్మక కేంద్రాలపై అధికారులు ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లేపల్లెను ఇప్పుడు అత్యంత సమస్యాత్మక కేంద్రంగా అధికారులు గుర్తించి, సీసీ కెమెరాలను అమర్చనున్నారు. దీంతోపాటు మరో ఐదు (చిత్తూరు రూరల్‌లోని సిద్ధంపల్లె, తుమ్మింద, కుప్పంలోని అడవిబూదుగూరు, నగరిలోని ఏకాంబరకుప్పం, వెదురుకుప్పం) కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఆరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, సమయానుసారంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు.

సెల్‌ఫోన్ల విషయంలో ప్రతిసారీ ఇదే తంతు

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదని అధికారులు చెబుతారు. కానీ పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.

115 పరీక్ష కేంద్రాలు.. 21,996 మంది విద్యార్థులు

జిల్లాలోని 31 మండలాల్లో 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21,996 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 11,140 మంది బాలురు, 10,556 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 15వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి విద్యార్థికిచ్చే ప్రశ్నపత్రంపై ఈ ఏడాది తొలిసారిగా ఏడు అంకెల సీరియల్‌ నెంబరును ముద్రించారు. ముందుగా 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇస్తారు. దాన్ని పూర్తిచేస్తే 12 పేజీల మరో బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. ఈసారి ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలను ఒకేరోజున నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే రెండు దఫాలుగా జిల్లాకు చేరుకున్నాయి. 29వ తేదీన ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాలు జిల్లాకు రానున్నాయి.

పొరపాటు జరిగితే వేటు తప్పదు

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సంబంధిత అధికారిపై సస్పెండ్‌ వేటు తప్పదు. ఎలాంటి ఆర్డర్‌ కాపీ లేకుండా పరీక్ష కేంద్రంలోకి ఏ అధికారి కూడా వెళ్లకూడదు. హాల్‌టికెట్‌ ఉన్నవారినే పోలీసులు లోపలికి అనుమతించాలి. వాటర్‌ బాయ్‌, అటెండర్లకు సైతం కేంద్రంలోకి అనుమతి లేదు. సిబ్బంది ఎవ్వరూ కూడా సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తాం.

- విజయేంద్రరావు, డీఈవో

Updated Date - 2023-03-26T01:00:11+05:30 IST