Share News

సంజీవయ్యకు టికెట్‌ ఇవ్వొద్దు

ABN , Publish Date - Dec 15 , 2023 | 01:04 AM

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వరాదంటూ వైసీపీ నాయకులు పలువురు డిమాండ్‌ చేశారు.

సంజీవయ్యకు టికెట్‌ ఇవ్వొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీమంత్‌రెడ్డి

సూళ్లూరుపేట వైసీపీలో ఒక వర్గం తీర్మానం

దొరవారిసత్రం, డిసెంబరు 14 : తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వరాదంటూ వైసీపీ నాయకులు పలువురు డిమాండ్‌ చేశారు. దొరవారిసత్రం మండలంలోని వెదరుపట్టు రోడ్డు పక్కన ఒక ఫామ్‌హౌ్‌సలో గురువారం సమావేశమైన నాయకులు అధిష్ఠానం ఎమ్మెల్యేకు టిక్కెట్‌ ఇవ్వకుండా నిర్ణయాలు చేపట్టే వరకు ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలని నిర్ణయించుకొన్నారు. జగన్‌ ముద్దు... సంజీవయ్య వద్దు ... అంటూ నినాదాలు చేశారు.సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రెండు పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన 61,292 ఓట్ల ఆఽధిక్యత సాధించారు. అయితే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆయన పోకడలను ఆ పార్టీలోని ఒక సామాజికవర్గానికి చెందిన వారు వ్యతిరేకిస్తూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లారు.పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చబోతున్నారనే వార్తలు రావడంతో గురువారం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వైసీపీ నాయకుడు కళత్తూరు రామమోహన్‌రెడ్డి ఫామ్‌హౌ్‌సలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సుమారు 200 మంది పాల్గొన్నారు.కళత్తూరు రామోహన్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు జనార్దన రెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కళత్తూరు శేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాండురంగయాదవ్‌, నాయుడుపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రఫీ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు హాజరయ్యారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అవినీతికి పాల్పడ్డారని, సొంత పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అటువంటి వ్యక్తికి మద్ధతుగా కొంతమంది ప్యాకేజి నాయకులు సీఎం వద్దకు వెళ్ళి సంజీవయ్య మంచి వ్యక్తి అని చెప్పుకొస్తున్నారని సమావేశంలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే సంజీవయ్యకు మరో మారు టిక్కెట్‌ ఇవ్వకుండా అడ్డుకోవాలని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా ఉండి అదిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

Updated Date - Dec 15 , 2023 | 01:05 AM