Share News

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు

ABN , Publish Date - Dec 24 , 2023 | 01:36 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ప్రతినిధుల బృందం జిల్లా అధికారులను ఆదేశించింది.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు-పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

-మూడేళ్ళకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న

అధికారులను జనవరి 30లోపు బదిలీ చేయండి

-వచ్చే ఎన్నికల్లో ఆన్‌లైన్‌ నామినేషన్‌ విధానం అమలు

-కలెక్టర్‌, ఎస్పీలతో సమీక్షలో సీఈసీ స్పష్టీకరణ

తిరుపతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ప్రతినిధుల బృందం జిల్లా అధికారులను ఆదేశించింది. విజయవాడలో రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంతో పాటు సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డిలతో సమీక్షించింది. ఈ సందర్భంగా బృందానికి నాయకత్వం వహించిన సీనియర్‌ డిప్యూటీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గవద్దని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తగిన భద్రత లేదనో లేక ఇతర కారణాలతోనో అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారుల వద్ద భౌతికంగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయలేకపోవడమన్న ప్రశ్నే తలెత్తకుండా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.అందులో భాగంగా అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేసే విధానం అందుబాటులోకి తెస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులకు సంబంధించి జిల్లాలో ఒకే చోట మూడేళ్ళకు పైబడి పనిచేస్తున్న వారి జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి నివేదించాలని ఆదేశించారు.సొంత జిల్లాల్లో పనిచేస్తున్న తహసిల్దారు, ఎంపీడీవోల నుంచీ డిప్యూటీ కలెక్టర్ల దాకా, పోలీసు శాఖలో సీఐ నుంచీ ఏఎస్పీ దాకా జాబితా అందజేయాలన్నారు. ఇలాంటి వారిని జనవరి 30వ తేదీలోపు బదిలీ చేయాలని ఆదేశించారు. జిల్లా నుంచీ ఓటర్ల జాబితాలో అక్రమాలపై విపరీతంగా ఫిర్యాదులు వచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూ క్లెయిమ్‌ల పరిష్కారం గురించి ప్రశ్నించారు. దీనికి కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి సమాధానమిస్తూ ఈ ఏడాది జనవరి నుంచీ ఈనెల దాకా మొత్తం 4 లక్షల క్లెయిమ్‌లు వచ్చాయని,వాటిలో 2 వేల క్లెయిమ్‌లు మాత్రమే పెండింగులో వున్నాయని, వాటిని కూడా ఈనెల 24వ తేదీ రాత్రిలోగా పరిష్కరిస్తామని కలెక్టర్‌ సమాధానమిచ్చారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి, అలాగే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత గురించి చేపట్టిన ఏర్పాట్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ వివరించారు.

చంద్రగిరి నుంచే విపరీతంగా ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి?

ఫిబ్రవరిలో మళ్ళీ వస్తాం... అప్పటికి సమస్యలేవీ వుండరాదు

పులివర్తి నానీ ఫిర్యాదులపై ప్రశ్నించిన సీఈసీ

విజయవాడలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం చంద్రగిరి నియోజకవర్గం గురించి జిల్లా అధికారులను ప్రశ్నించింది. ఆ నియోజకవర్గం నుంచీ విపరీతంగా ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? పులివర్తి నానీ ఎవరు? అంటూ ఆరా తీసింది. ఆ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరుగుతున్నాయని పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయంటూ ప్రస్తావించిన బృందంలోని అధికారులు ఆ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్‌ నుంచీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరితో సహా అన్ని నియోజకవర్గాల నుంచీ వచ్చిన క్లెయిమ్‌లను పరిష్కరించామని, స్వల్ప సంఖ్యలో పెండింగులో వున్న వాటిని కూడా ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి సమాధానమిచ్చారు. చంద్రగిరిలో ఎలాంటి సమస్యా తలెత్తకుండా చూస్తామన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం మాట్లాడుతూ తాము మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రానికి వచ్చి జిల్లాల వారీగా సమీక్షిస్తామని, అప్పటికి సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది.

Updated Date - Dec 24 , 2023 | 01:36 AM