ఆగిన వేరుశనగ విత్తనకాయల పంపిణీ
ABN , First Publish Date - 2023-06-07T00:10:25+05:30 IST
గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరుతో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఆగింది.
గుడిపాల, జూన్ 6: గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరుతో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఆగింది. ఈ గ్రామంలో ఇద్దరు నాయకులు.. రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయా పంచాయతీల్లో వేరుశనగ విత్తనకాయల పంపిణీ బాధ్యతను స్థానిక సర్పంచి లేదా నాయకులకు అప్పగించారు. దీంతో సోమవారం విత్తన కాయలు పంపిణీ చేయాలని గ్రామ సచివాలయంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్‌పై ఒకవర్గానికి చెందిన నేత ఒత్తిడి తెచ్చారు. మరో వర్గానికి చెందిన నాయకుడు కూడా వస్తే వస్తే పంపిణీ చేపడతామని ఆ ఉద్యోగి చెప్పారు. ఈ విషయం వీరిమధ్య వాగ్వాదం జరిగింది. ఇక, మంగళవారం విత్తన కాయల పంపిణీకి మరో నేత ప్రయత్నించగా.. ఎమ్మెల్యే వచ్చేవరకు ఆపాలంటూ ఇంకో వర్గం నేత అడ్డుకున్నారు. ఇలా వైసీపీలోని వర్గపోరుతో రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాల పంపిణీ జరగకుండా ఆపేశారు. రైతులకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చే కాయల పంపిణీలో అధికార పార్టీ నేతల జోక్యం ఏమిటంటూ రైతులు ఆరోపిస్తున్నారు. చివరకు ఈ పంచాయితీ ఎమ్మెల్యే చెంతకు చేరినట్లు సమాచారం.