Share News

జిల్లాకు తుఫాను ముప్పు

ABN , First Publish Date - 2023-12-03T02:35:38+05:30 IST

జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆదివారం మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాఖ హెచ్చరించింది.

జిల్లాకు తుఫాను ముప్పు
సముద్రంలో ఎగసి పడుతున్న అలలు

- నేటినుంచి మూడ్రోజులపాటు

భారీ వర్షాలకు అవకాశం

- తీర ప్రాంత గ్రామాలు, లోతట్టు

జనావాసాలకు ముంపు ప్రమాదం

- అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

- ఉద్యోగులకు సెలవులు రద్దు

- స్కూళ్లు, కాలేజీలకు

రేపు సెలవు, ‘స్పందన’ రద్దు

జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆదివారం మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు తీర ప్రాంత గ్రామాలు, లోతట్టు జనావాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులకు, అధికారులకు సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారు తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. మరోవైపు జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించడంతోపాటు కలెక్టరేట్‌, డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది. సముద్రంలో వేటకు పోవద్దని తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను హెచ్చరించింది.

తిరుపతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం మన జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలపై పడే ప్రమాదముందని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. నెల్లూరు జిల్లాలో కురిసే వర్షాలకు కండలేరు రిజర్వాయర్‌ నుంచి పూండి వరకూ 90 కిలోమీటర్ల మేర తెలుగుగంగ కాలువల్లో నీటి ప్రవాహం పెరిగే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిధిలో కాలువకు, అనుబంధ కాలువలకు లీకేజీలు, పొంగితే ముంపునకు గురయ్యే అవకాశమున్న గ్రామాలు, జనావాసాలను గుర్తించేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే అధికారులు, ఉద్యోగులతో పలు బృందాలు ఏర్పాటు చేసి కాలువ వెంబడి పర్యటించి.. ప్రమాదపు అవకాశాల్ని అంచనా వేయాలని ఆదేశించింది. శనివారం అర్ధరాత్రిలోగా నివేదికలు అందజేయాలని ఆదేశించింది. దానికనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది.

స్వర్ణముఖిపై తాత్కాలిక రోడ్లు, కల్వర్టులపై ఆందోళన

జిల్లాలో ప్రత్యేకించి స్వర్ణముఖి నదిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్లు, కల్వర్టుల పటిష్ఠతపై జిల్లా అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు చంద్రగిరి నుంచి ఏర్పేడు దాకా స్వర్ణముఖిపై ఉన్న వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆయా చోట్ల వాహనాల రాకపోకలకు వీలుగా సిమెంటు పైపులు వేసి, తాత్కాలికంగా కల్వర్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభమవడంతో ఆది, సోమ, మంగళవారాల్లో గనుక భారీ వర్షాలు సంభవిస్తాయన్న అంచనా ఉంది. అలా జరిగి స్వర్ణముఖిలో నీటి ప్రవాహం పెరిగితే తాత్కాలిక కల్వర్టులన్నీ కొట్టుకుపోయే ప్రమాదముంది. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

తీర ప్రాంత గ్రామాలకు ముంపు ముప్పు

గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని సముద్ర తీర ప్రాంత గ్రామాలకు తుఫాను నేపథ్యంలో ముంపు ముప్పు పొంచి ఉంది. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో తీర గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో మూడ్రోజులుగా గ్రామస్తులతో అధికారులు సమావేశాలు నిర్వహించి, సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోట మండలంలో గోవిందపల్లిపాళెం, శ్రీనివాససత్రం, కొత్తపట్నం, వావిళ్ల దొరువు, యమదిన్నెపాలెం, గున్నంపడియ గ్రామాలు... వాకాడు మండలంలో తూపిలిపాలెం, కొండూరుపాలెం, అంజలాపురం, తానాకట్ట, శ్రీనివాసపురం, పూడిరాయదొరువు, చిన్నతోట, నవాబ్‌పేట గ్రామాలు... చిల్లకూరు మండలంలో తమ్మినపట్నం, గుమళ్లదిబ్బ, వరగలి, మోమిడి, లింగవరం గ్రామాలు తీర ప్రాంతంలో ఉండి, తుఫానుతో సముద్ర నీటితో ముంపు ముప్పునకు గురయ్యే ప్రమాదముంది. ఈ గ్రామాల్లో అధికారులు ఇప్పటికే పలుమార్లు పర్యటించి అవసరమైన ముందస్తు హెచ్చరికలు చేశారు. సమీప ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైతే గ్రామస్తులను అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్ణముఖి నదికి వరదలొస్తే వాకాడు మండలం శ్రీనివాసపురం జల దిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదముంది. అలాగే చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం సైతం వరద నీటికి జల దిగ్బంధానికి గురయ్యే ప్రమాదముంది. సూళ్లూరుపేట నియోజకవర్గం విషయానికొస్తే కాళంగి నదికి వరద వస్తే సూళ్లూరుపేట పట్టణం వడ్రపాలెం ముంపునకు గురయ్యే అవకాశముంది. అలాగే సూళ్లూరుపేట-మన్నారుపోలూరు మార్గంలోకి నీరు చేరి వాహనాల రాకపోకలు ఆగిపోతాయి. తడ మండలం మాంబట్టు, వెండూరుపాడు, కాదలూరు గ్రామాలూ ముంపునకు గురయ్యే అవకాశముంది.

రిజర్వాయర్ల వద్ద కాపలా

జిల్లాలోని అరణియార్‌, కాళంగి, మల్లిమడుగు రిజర్వాయర్లు, కళ్యాణి డ్యామ్‌ వంటి చోట్ల అధికార యంత్రాంగం కాపలా ఏర్పాటు చేసింది. శనివారం ఇరిగేషన్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు వీటిని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. అరణియార్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.85 టీఎంసీలు కాగా ఇప్పటికే అందులో ఒక టీఎంసీ నీరుంది. రిజర్వాయరు లోతు 281 అడుగులు కాగా ప్రస్తుతం 274 అడుగుల వరకూ నీరుంది. ప్రస్తుత వర్షాలకు రిజర్వాయరులోకి 470 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కళ్యాణి డ్యామ్‌ లోతు 900 అడుగులు కాగా ఇపుడు 857 అడుగుల వరకూ నీరుంది. 0.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యామ్‌లో ఇపుడు 0.163 టీఎంసీల నీరుంది. ప్రస్తుత వర్షాలకు స్వల్పంగా అంటే 30 క్యూసెక్కుల నీరు డ్యామ్‌లోకి చేరుతోంది. మల్లిమడుగు రిజర్వాయరు లోతు 366 అడుగులు కాగా ఇపుడు 362.80 అడుగుల వరకూ నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 0.181 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయరులో 0.113 టీఎంసీల నీరుంది. తాజా వర్షాలకు 300 క్యూసెక్కుల నీరు రిజర్వాయరులోకి చేరుతోంది. కాళంగి రిజర్వాయరు లోతు 222 అడుగులు కాగా ఇపుడు 212 అడుగుల వరకూ నీరుంది. రెండ్రోజులుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు 324 క్యూసెక్కుల నీరు రిజర్వాయరులోకి చేరుతోంది. ఈ రిజర్వాయర్‌ గేట్లు కొట్టుకుపోయినందున నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. కాబట్టి పెద్దగా ప్రమాదం లేదు. జిల్లాలో కళ్యాణి డ్యామ్‌ మినహా మరే రిజర్వాయరులోనూ ఇప్పటికైతే అవుట్‌ ఫ్లో లేదు. కళ్యాణి డ్యామ్‌ నుంచి తాగునీటి కోసం 5 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

మిగిలిన ప్రాంతాల్లో ఇలా..

వెంకటగిరి పట్టణంలో తోలిమిట్ట, ఎన్టీఆర్‌ కాలనీ, ఉప్పాపురం, ధర్మాపురం, గొల్లపాలెం తదితర లోతట్టు ప్రాంతాలు భారీ వర్షాలకు జలమయమయ్యే అవకాశం ఉంది. మున్సిపల్‌ అధికారులు సమావేశాలు పెట్టి, హెచ్చరికలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఫ కేవీబీపురం మండలం ఎగువపూడి, దిగువ పూడి గ్రామాలకు ఏటి ప్రవాహంతో ఇబ్బంది. ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఫ బీఎన్‌ కండ్రిగ మండలం పెల్లేటివారి కండ్రిగ, పుట్టేరి గ్రామాలకు రాకపోకలు ఆగే అవకాశముంది. గ్రామాల్లోకి నీరొచ్చే అవకాశం కూడా ఉంది.

ఫ శ్రీకాళహస్తి పట్టణం చెంచులక్ష్మి కాలనీ, తుఫాను సెంటరు, లంకమిట్ట తదితర ప్రాంతాల్లో గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాళహస్తి మండలం వేడాం ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, చుక్కలనిడిగల్లు ఎస్టీ కాలనీలకు కైలాసగిరి నుంచి వచ్చే వర్షపు నీటితో ముంపు ప్రమాదముంది.

ఫ తొట్టంబేడు మండలం బోనుపల్లి, కారాకొల్లు గ్రామాలకు కాళంగి కాలువ కారణంగా ముంపు ప్రమాదం పొంచి ఉంది.

ఫ ఏర్పేడు మండలం గుడిమల్లం మార్గంలో స్వర్ణముఖిపై వంతెన కొట్టుకుపోయింది. రెండేళ్ల కిందట సిమెంట్‌ పైపులతో తాత్కాలిక నిర్మాణం ఉంది. వరద ఉధృతి పెరిగితే కొట్టుకుపోయే ప్రమాదముంది.

ఫ వడమాలపేట మండలం గూళూరు చెరువు ఇప్పటికే నిండి ఉంది. ఎంతోకాలంగా నీటిని వెలుపలికి వెళ్లే అవకాశం లేకుండా చేయడంతో నిత్యం ప్రమాదం అంచున ఉండే ఈ చెరువు ఇపుడు తుఫాను నేపథ్యంలో గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- ఇబ్బందులుంటే 0877 2236007

నెంబరుకు ఫోన్‌ చేయండి: కలెక్టర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 2: తుఫాన్‌ ప్రభావం జిల్లాపై ఆదివారం నుంచి మూడ్రోజులు ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు సూచనలిచ్చారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ (0877 2236007)కు ఫోన్‌ చేయాలని కోరారు.

చేపల వేటకు వెళ్లొద్దు

తుఫాన్‌ ముగిసే వరకు మత్స్యకారులెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ సూచించారు. జేసీ బాలాజి, డీఆర్వో పెంచలకిషోర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వాహనదారులూ జాగ్రత్త

- జిల్లా రవాణాశాఖాధికారి

తిరుపతి (రవాణా), డిసెంబరు 2: తుఫాను నేపథ్యంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు జిల్లా రవాణాశాఖాధికారి సీతారామిరెడ్డి సూచించారు. వాగులు, వంకలు రోడ్డుపై ప్రవహించేటప్పుడు నీటి మట్టాన్ని తెలుసుకోకుండా వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లారవాణాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నీటి ఉధృతి గమనించి బస్సులు నడపండి

తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 2: రోడ్లపై నీటి ఉధృతిని గమనించి బస్సులు నడపాలని డ్రైవర్లు, కండక్టర్లకు ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి, సీబీఎస్‌ ఏటీఎం డి.రామచంద్రనాయుడు సూచించారు. తిరుమల ఘాట్‌లో అధిక వేగంతో నడపొద్దన్నారు. శనివారం రాత్రి తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్లే వెంకటగిరి సూపర్‌ లగ్జరీ రెండు బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఆయా డిపో మేనేజర్లకు సమాచారం అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం!

కోట, డిసెంబరు 2: తుఫాన్‌ ప్రభావంతో కోట మండలంలోని గోవిందపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రం గ్రామాల్లో ఉన్న సముద్రం శనివారం కల్లోలభరితంగా మారింది. గోవిందపల్లిపాళెం వద్ద అయితే సముద్రం సుమారు 30 మీటర్లు ముందుకొచ్చిందని మత్స్యకారులు తెలిపారు. గోవిందపల్లిపాళెం వద్ద చల్లకాలువ, ఉప్పుటేరు ఒక్కటిగా మారి ఆ ప్రాంతమంతా సముద్రాన్ని తలపించింది. బకింగ్‌హామ్‌ కెనాల్‌కి కూడా భారీగా వర్షపునీరు చేరింది. ఆపద సమయంలో 99895 02068 నెంబరుకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు

వాకాడు, డిసెంబరు 2: తుఫాన్‌ ప్రభావంతో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు తెలిపారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాల మత్స్యకారులు, తీరం వద్ద నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

15 మండలాల్లో మోస్తరు వర్షం

- నాయుడుపేటలో అత్యధికంగా 54.4 మి.మీ.

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 2: జిల్లాలో శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6గంటల వరకు 15 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నాయుడుపేటలో అత్యధికంగా 54.4మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. పెళ్లకూరులో 48.2, తొట్టంబేడులో 42, ఏర్పేడు, నాగలాపురంలో 40.2, శ్రీకాళహస్తి, రేణిగుంటలో 39, పిచ్చాటూరులో 36.4, బీఎన్‌కండ్రిగలో 30.4, సూళ్లూరుపేట, చిట్టమూరులో 28.2, వడమాలపేట, తిరుపతి(అర్బన్‌)లో 26.6, ఓజిలిలో 23.6, ఆర్‌సీపురంలో 22.2, తడలో 21.4మి.మీ. వర్షం కురిసింది.

పలు రైళ్ల రద్దు

రేణిగుంట, డిసెంబరు 2: తుఫాన్‌ ప్రభావంతో తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే 12 ఎక్స్‌ప్రెస్స్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి నుంచి హైదరాబాదు, నిజమాబాదు, విశాఖపట్టణం, పూరి, భువనేశ్వర్‌, కన్నియాకుమారి, బెంగళూరు, నరసాపురం, మచిలీపట్నం మధ్య రాక పోకలు నిర్వహించే ఎక్స్‌ప్రె్‌సలను ఆది, సోమ, మంగళవారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2023-12-03T02:35:41+05:30 IST