నేడు మాంబట్టుకు సీఎం జగన్
ABN , First Publish Date - 2023-11-21T02:45:53+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తడ మండలంలో పర్యటించనున్నారు. మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఆయన మాంబట్టులో జరిగే బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
తడ, నవంబరు 20: ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తడ మండలంలో పర్యటించనున్నారు. మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఆయన మాంబట్టులో జరిగే బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ గన్నవరం నుంచీ విమానంలో బయల్దేరి 9.45 గంటలకు రేణిగుంటలోని విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచీ పది గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 10.20 గంటలకు మాంబట్టు సెజ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకుంటారు.10.45గంటలకు మత్స్యకార దినోత్సవ సభా ప్రాంగణం చేరుకుని సాగరమాల పథకం కింద రూ. 122 కోట్ల అంచనా వ్యయంతో పులికాట్ సరస్సులో పూడికతీత పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే కాళంగి నదిపై రూ. 35 కోట్లతో నాలుగు వరుసల రోడ్డుకు సరిపడా వంతెన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పులికాట్ సరస్సు నుంచీ ఉప్పునీరు కాళంగి నదిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రూ. 9.98 కోట్లతో గ్రాయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.12.40 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీ నేతలతో హెలిపాడ్ వద్ద గంట పాటు సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో సోమవారం హెలిప్యాడ్‌కు హెలికాప్టర్, కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. సుమారు 1200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.800 ప్రత్యేక బస్సుల ద్వారా జనాలను తరలించే ఏర్పాట్లు చేశారు.సోమవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు వర్షం కురుస్తుండడం స్థానిక వైసీపీ నాయకుల్లో ఆందోళన కల్గిస్తోంది.
రైతు భరోసా వచ్చే వారంతా సీఎం సభకు రావాలి: గ్రామాల్లో వలంటీర్ల ప్రచారం
ఏర్పేడు, నవంబరు 20: రైతు భరోసా వచ్చిన రైతులంతా మాంబట్టులో జరిగే ముఖ్యమంత్రి సభకు రావాలని వలంటీర్లు గ్రామాల్లో పిలిచారు.ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో కొంతమంది వలంటీర్లు రైతుల సెల్‌ఫోన్లకు ఈ మెసేజ్‌లు పెట్టారు.జగన్ సభకు రాకపోతే సంక్షేమ పథకాలు రావని కొంతమంది వలంటీర్లు ప్రచారం చేయడం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది.
బస్సుల తరలింపుతో ప్రయాణికులకు ఇక్కట్లు
పుత్తూరు, నవంబరు 20 : ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం సోమవారం పుత్తూరు ఆర్టీసీ డిపో నుంచి 35 బస్సులను తరలించారు.వీటిలో నగరి చుట్టుపక్కల గ్రామాల మీదుగా తిరిగే 22 పల్లె వెలుగు సర్వీసులు, తిరుత్తణి- తిరుపతి మధ్య తిరిగే 9 సర్వీసులు, చిత్తూరుకు తిరిగే 2బస్సులతో పాటు స్పేర్ బస్సులు 2 వున్నాయి. దీంతో పల్లె ప్రజలు,తిరుపతికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరుపతి నుంచి వచ్చే ప్రయాణీకులు చెన్నైకు వెళ్లే తమిళనాడు సర్వీసులు, తిరుత్తణికి వెళ్లే బస్సులను ఎక్కి వ్యయ ప్రయాసలతో స్వస్థలాలకు చేరుకున్నారు.