ప్రచార భేరి
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:35 AM
నేటినుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం పర్యటన ప్రజలకు సందేశం.. శ్రేణులకు నిర్దేశం
కుప్పం, డిసెంబరు 27: జగన్ ప్రభుత్వం కక్షల కేసులతో జైలు పాలై, కోర్టు అనుమతితో బయటకు వచ్చిన చంద్రబాబు కోసం కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వేధింపుల తీరుపై ఆందోళనపడ్డ జనం ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికీ పట్టకుండా దశాబ్దాల పాటు ఏ అభివృద్ధికీ అందకుండా విసిరేసినట్టుండే కుప్పం ప్రాంతాన్ని తన నియోజకవర్గంగా ఎన్నుకుని ప్రపంచం దృష్టినే కుప్పం వైపునకు మళ్లించిన నేతకు ఇన్ని కష్టాలా అని ఆవేదన చెందిన ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తారు. రోడ్‌షోల్లో ప్రజల కష్టాలు వింటూ, కార్యకర్తలతో మాటామంతీ జరుపుతూ, బహిరంగ సభల్లో ఉపన్యసిస్తూ ఆయన పర్యటన సాగనుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జరుగుతున్న ఈ పర్యటనకు విశేషమైన రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఒకరకంగా ఎన్నికల ప్రచార భేరిగా కూడా చంద్రబాబు మూడు రోజుల పర్యటనను పరిగణించవచ్చు.
జూన్ 14 నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు కుప్పం ప్రజలను కంటతడి పెట్టించాయి. నిప్పులా బతికిన తమ అభిమాన నేతను జైలుపాలు చేసిన జగన్ ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహోదగ్రులై అనేక చోట్ల ఆందోళనలు నిర్వహించారు. జైలులో సరైన సౌకర్యాలు లేక తమ ఎమ్మెల్యే అనారోగ్యంపాలైనారని తెలిసి, ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ఆలయాల్లో పూజలు చేశారు. కోర్టు జోక్యంతో బయటకు వచ్చిన తమ అభిమాన నాయకుడిని కళ్లారా చూసి, ఆయన మాటలు వినడానికి వీరంతా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనపట్ల ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు.
యువకెరటం
పార్టీ కేడర్ ఉత్సాహంతో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో ఉంది. బాబు నేతృత్వంలో ఆయన దిశానిర్దేశంలో ఎన్నికల రణరంగంలోకి దూకడానికి పూర్తి సంసిద్ధంగా ఉంది. నారా లోకేశ్ పాదయాత్ర తర్వాత కుప్పంలో యువత ప్రాధాన్యం పెరిగింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు నియోజకవర్గ పగ్గాలను అప్పగించారు. ఆయన ప్రొటోకాల్‌ను కూడా ఇక్కడకు మార్చుకున్నారు. లోకేశ్, చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూకుడు పెంచారు. పార్టీలో సీనియర్లు కొందరు ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నా, పార్టీ అధినేత కంచర్లనే సమర్థించినట్లు తెలిసింది. అయితే సీనియర్లకు, యువతకు మధ్య గ్యాప్ పెరగకుండా ఆయన ఈ పర్యటనలో దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.
భారీ స్థాయిలో చేరికలు
చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉండబోతున్నాయి. ఎన్నికల అనంతరం పార్టీని వీడిన వారిని కొందరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే వైసీపీలో భవిష్యత్తు లేదని నమ్ముతున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే టీడీపీ తలుపు తడుతున్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నేతృత్వంలో పార్టీలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కడికక్కడ బహిరంగ సభలకు ముందుగానో లేదా తర్వాతో చంద్రబాబు చేత కండువాలు కప్పించి పార్టీలోకి ఆహ్వానించే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
ఇలా సాగుతుంది బాబు పర్యటన
ఈనెల 28వ తేదీన గుడుపల్లె, 29న శాంతిపురం, రామకుప్పం, చివరి రోజైన కుప్పం మండలంలోని మల్లానూరు పంచాయతీ కేంద్రంలో చంద్రబాబు బహిరంగ సభలకోసం భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రయాణించే మార్గం పొడవునా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు గుడుపల్లెలో బహిరంగ సభతో ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన, చివరి రోజైన 30వ తేదీ సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటలదాకా కుప్పం మండలం మల్లానూరులో నిర్వహించే బహిరంగ సభతో ముగియనుంది. ఈ మధ్యలో మూడురోజులపాటు పార్టీ కార్యాలయంతోపాటు శాంతిపురం, కుప్పం పట్టణాలలోని కల్యాణ మండపాలలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు.