అయితే ఓకే.. లేదా కూల్చేయ్!
ABN , First Publish Date - 2023-06-26T01:38:13+05:30 IST
అనుమతులు అడిగితే పెండింగులో పెడతారు. ‘ఒప్పందం’ కుదిరితే అప్రూవల్ ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘించి కడుతుంటే చూస్తుంటారు. ఆపై నోటీసులిస్తారు. అధికారులను కలిసి ‘మాట్లాడుకుంటే’ అక్కడితో ఆగతారు. లేదంటే ఆగమాగం చేస్తారు. వీరికితోడు కొందరు అధికార పార్టీ నేతలూ దందాకు దిగారు. ఇలా చిత్తూరులో అనుమతిలేని నిర్మాణాలను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మాటవినకుంటే నిర్మాణాలను కూల్చేస్తున్నారు.
అనుమతులు అడిగితే పెండింగులో పెడతారు. ‘ఒప్పందం’ కుదిరితే అప్రూవల్ ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘించి కడుతుంటే చూస్తుంటారు. ఆపై నోటీసులిస్తారు. అధికారులను కలిసి ‘మాట్లాడుకుంటే’ అక్కడితో ఆగతారు. లేదంటే ఆగమాగం చేస్తారు. వీరికితోడు కొందరు అధికార పార్టీ నేతలూ దందాకు దిగారు. ఇలా చిత్తూరులో అనుమతిలేని నిర్మాణాలను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మాటవినకుంటే నిర్మాణాలను కూల్చేస్తున్నారు.
- చిత్తూరు
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టడం యజమానులకు తలకుమించిన భారంగా మారుతోంది. ఆన్‌లైన్ విధానం అమల్లోకి రావడంతో కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రస్తుతం నగరంలో 200 వరకు ప్లాన్ అప్రూవల్ తీసుకున్న భవనాల నిర్మాణాలు చేపట్టగా.. మరో 150 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయి. సాధారణంగా ఆయా డివిజన్లలో వార్డు సచివాలయాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటారు. అక్కడ్నుంచి టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌కు వస్తుంది. ఇక్కడే టౌన్ ప్లానింగ్ అధికారుల్లో కొందరు తమ తెలివిని ఉపయోగిస్తారు. అంతకుముందే ఇంటి ప్లాన్లు వేసుకోవడానికి వెళ్లినవారికి కొందరు లైసెన్స్‌డ్ ఇంజనీర్లే రేట్లను నిర్ణయిస్తారు. ఇంజనీర్ల వద్ద కమిట్ అయిన వారి వివరాలను మాత్రమే టౌన్ ప్లానింగ్ అధికారులకు చేరవేస్తారు. కమిట్‌మెంట్ కాని వారి ప్లాన్ అప్రూవల్స్‌ను సర్వే నెంబరు, సైట్ ట్యాలీ కాలేదని పెండింగ్‌లో పెడతారు. ఉదాహరణకు ఇంటి పత్రాల్లో స్థలం సెంట్లలో ఉంటే ఆన్‌లైన్‌లో తీసుకోదు. ఇలాంటి కారణాలు చూపి రేటు కుదిరేంత వరకు పెండింగ్‌లోనే పెడుతూ వస్తారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత సంబంధిత యజమానులు వచ్చి మాట్లాడి.. అంతా ‘ఓకే’ అయ్యాక సెంట్లలో ఉన్న వివరాలను కాకుండా సర్వే నెంబర్లను నమోదు చేసి అనుమతులు ఇస్తారు. వాణిజ్య భవన నిర్మాణాలైతే అధికారులకు, అధికారపార్టీలోని సంబంధిత నేతలను ‘ప్రసన్నం’ చేసుకోవాల్సిందే. లేదంటే సవాలక్ష నిబంధనలతో అనుమతులకు కొర్రీలేస్తుంటారు.
వాళ్లకు నోటీసులతో సరి
సాధారణంగా ప్లాన్ అప్రూవల్స్‌తోనే ఇల్లు, లేదా వాణిజ్య భవనాల నిర్మాణం చేపట్టాలి. చాలా మంది అప్రూవల్స్ లేకుండా, ప్లాన్‌లో ఉన్న వాటికన్నా ఇంకాస్త పొడిగించడం, రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని నాలుగు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా నిర్మాణాలు జరిగిన వాటిని వార్డు కార్యదర్శి, వలంటీర్లు, సిబ్బంది ద్వారా తెలుసుకుంటారు. అలాంటి నిర్మాణాల పనులను ఆపేయమని నోటీసులు ఇస్తారు. వాళ్లు వచ్చి సంబంధిత అధికారులతో ‘మాట్లాడటం’ జరిగితే అలా వదిలేస్తారు. ఒకవేళ ఈ నిర్మాణాలపై పత్రికలు లేదా సామాజిక మాధ్యమాల్లో వస్తే.. నోటీసులు ఇచ్చామని పైఅధికారులకు సమాధానం చెప్పుకొంటారు. ఇలా నగరంలో ఇప్పటి వరకు సుమారు రెండువేల మంది వరకు నోటీసులిచ్చి వదిలేశారని సమాచారం.
ఆ నాయకుడికి కోపమొచ్చి..!
వెంకటేశ్వరకాలనీలో ఓ ఇంటితో పాటు దుకాణ సముదాయాన్ని తనకు అమ్మేయాలని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త విశ్రాంత ఉద్యోగిని అడిగాడు. నగరపాలక సంస్థ స్థలంలో కట్టారంటూ తక్కువ రేటు నిర్ణయించాడు. దీనికి ఆ విశ్రాంత ఉద్యోగి ఒప్పుకోలేదు. మున్సిపల్ స్థలంలో కట్టినందున రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ యజమాని చివరకు రూ.2లక్షలు ఇస్తాననడంతో ఆ నేతకు కోపమొచ్చింది. అంతే టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. మూడు అడుగుల వరకు రోడ్డుపైకి వచ్చిందని ఆ భవనాన్ని కూల్చివేశారు. ఆ నాయకుడి ఒత్తిడితోనే ఈ కూల్చివేత జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి సాగుతున్నారు.