తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి
ABN , First Publish Date - 2023-12-03T02:44:55+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారుతున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షన్మోహన్ సూచించారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 2: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారుతున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షన్మోహన్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తద్వారా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగు చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్‌లో 94910 77356 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. వాగులు, వంకలు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
9 మండలాల్లో వర్షం
జిల్లాలో శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు తొమ్మిది మండలాల్లో వర్షం పడింది. యాదమరిలో 8.4 మి.మీ, పుంగనూరులో 4.2, వెదురుకుప్పంలో 2.8, కార్వేటినగరంలో 2.6, పులిచెర్లలో 2.2, పెద్దపంజాని, జీడీనెల్లూరు, వి.కోటలో 2, సదుంలో 0.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఎన్టీఆర్ జలాశయం నుంచి నీరు విడుదల
పెనుమూరు, డిసెంబరు 2: పెనుమూరు మండలం కలవగుంటలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి అధికారులు శనివారం ఒక గేటు ద్వారా 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు జలాశయంలోకి నీరు చేరుతోంది. దీంతో పాటు శనివారం రాత్రి భారీ వర్షం కురుస్తుందన్న వార్తల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ భాస్కర్‌రెడ్డి తెలిపారు.