Nadda: ఇంత అవినీతా?

ABN , First Publish Date - 2023-06-11T02:59:05+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా మండిపడ్డారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా...అనేక రంగాల్లో కుంభకోణాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు.

Nadda: ఇంత అవినీతా?

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసేశారు

ఆంధ్రలో దారుణ పరిస్థితులు: నడ్డా

వైసీపీ సర్కారు అత్యంత అవినీతిమయం

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు

కేంద్ర నిధుల దారిమళ్లింపు

సీమ అభివృద్ధినీ సర్కారు విస్మరించింది

శాంతి కనిపించదు.. భద్రత వినిపించదు

శ్రీకాళహస్తి బహిరంగ సభలో

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ధ్వజం

నేడు విశాఖకు అమిత్‌షా

ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ నిర్ణయించారు. ప్రధాని మోదీ భూమిపూజ కూడా చేశారు. ఈ క్రమంలో దాని చుట్టూ జాతీయ రహదారులు, రైల్వే లైన్లు ఇస్తే.. వైసీపీ దౌర్భాగ్యపు పాలనతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసింది.

మోదీ ఏపీని అభివృద్ధి చేయాలని చూస్తుంటే వైసీపీ డబ్బుల సంపాదన లక్ష్యంగా పనిచేస్తోంది.

- జేపీ నడ్డా

శ్రీకాళహస్తి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా మండిపడ్డారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా...అనేక రంగాల్లో కుంభకోణాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని, ఇలాంటి అన్యాయ, అరాచక పాలనను తానెక్కడా చూడలేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తుంటే.. ఆంధ్రలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని.. ఎక్కడా శాంతి కనిపించదు.. భద్రత వినిపించదని వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులను దారిమళ్లిస్తూ అసమర్థ ప్రభుత్వంగా వైసీపీ నిలిచిందని చెప్పారు. అవినీతికి పెద్దపీట వేసిందన్నారు. రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మోదీ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని.. 9ఏళ్లుగా రాజకీయాల దృక్పథాన్నే మార్చేశారని తెలిపారు. ‘కరోనా కాలంలో 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల బియ్యం, ఇతర సరుకులు అందజేశాం. 22కోట్ల మంది మహిళలకు రూ.500చొప్పున ప్రతి నెలా ఇచ్చాం. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద 47 లక్షల మంది రైతులు ఏపీలో లబ్ధిపొందుతున్నారు. జన్‌ధన్‌ పథకం కింద నేరుగా రూ.22.46లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్న దేశం.. మోదీ కృషితో ఐదో స్థానానికి ఎదిగింది. ఆటోమొబైల్‌ రంగంలో నాలుగో స్థానం, ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం సాధించాం’ అని వివరించారు.

1Tpt9.jpg

బేరీజు వేసుకోండి..

‘పాలకుడు తనకు తోచినపని చేయకూడదు. ప్రజలకు ఏది మంచో అలాంటి పనులు చేయాలని పెద్దలు చెప్పిన మాట’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. గడచిన 9ఏళ్ల పాలనలో బీజేపీ ఎలాంటి పాలన అందించిందో, నాలుగేళ్లలో వైసీపీ నుంచి ఎలాంటి పాలన అందుకుంటున్నామో ప్రజలు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీజేపీలోకి కొత్తగా వచ్చాను. మనకు భవిష్యత్‌ ఈ పార్టీతోనే. మోదీ అవినీతిపరులను ఏరిపారేస్తున్నారు. అందరినీ ఏరిపారేయాలని కోరుకుంటున్నాను. బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రాంతీయ పార్టీలతో ఒరిగేదేం లేదు. వారి ఖజానాలు నింపుకోవడం తప్ప మరొకటి లేదు’ అని చెప్పారు.

నాలుగేళ్ల పాటు జగన్‌రెడ్డి మన నెత్తిన శఠగోపం పెడితే, 9 ఏళ్లుగా ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతూ మోదీ జనరంజక పాలన అందిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. ‘రైతన్నల కోసం మోదీ పీఎంకిసాన్‌ తీసుకొస్తే.. ఈ రాష్ట్రంలో ఉత్తుత్తి బటన్లు నొక్కి మభ్యపెడుతున్నారు. విద్యార్థుల కోసం రూ.69 వేలు కేంద్రం ఇస్తుంటే.. అమ్మఒడి పేరుతో రూ.15 వేలు ఇస్తున్నారు. మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాలో వేస్తున్నారో అర్థం కావడంలేదు. జగన్‌రెడ్డికి పేర్ల పిచ్చి పట్టుకుంది’ అని మండిపడ్డారు. బీజేపీ-జనసేన కూటమికి అవకాశమివ్వాలని కోరారు. సభలో బీజేపీ నేతలు సీఎం రమేశ్‌, సుజనాచౌదరి, వాకాటి నారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, సామంచి శ్రీనివాస్‌, భానుప్రకాశ్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కోలా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలేశుడి సన్నిధిలో నడ్డా

తిరుమల, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): దేశాన్ని నడిపించేందుకు కావలసిన శక్తి, ధైర్యాన్ని ఆశీస్సుల రూపంలో అందించాలని శ్రీవారిని ప్రార్థించానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకునే అదృష్టం లభించిందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని.. దేశాన్ని ప్రగతి పథంలో నడపాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

నేడు విశాఖలో అమిత్‌షా సభ

విశాఖపట్నం, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం విశాఖ రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సంపర్క్‌ అభియాన్‌ సభలో ప్రసంగించనున్నారు. చెన్నై నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. సభలో మాట్లాడిన అనంతరం విశాఖ పోర్టు గెస్ట్‌హౌ్‌సకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 8 గంటలకు అక్కయ్యపాలెంలోని సాగరమాల ఆడిటోరియంలో ‘శక్తి కేంద్ర’ ప్రముఖ్‌లతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు విమానంలో ఢిల్లీ బయల్దేరతారు.

Updated Date - 2023-06-11T02:59:05+05:30 IST