భారీ టిప్పర్లతో తారురోడ్డు ధ్వంసం

ABN , First Publish Date - 2023-06-07T00:15:59+05:30 IST

చిత్తూరు-తచ్చూరు హైవేరోడ్డు పనులకు సంబంధించి భారీ టిప్పర్లలో ఇసుక, కంకరరాళ్ళు తరలిస్తుండటంతో తారురోడ్డు ధ్వంసమవుతోందని గంగాధరనెల్లూరు మండలం పెద్దకాల్వ గ్రామస్థులు మంగళవారం ధర్నా చేశారు.

భారీ టిప్పర్లతో తారురోడ్డు ధ్వంసం
టిప్పర్‌ ముందు ధర్నా చేస్తున్న గ్రామస్థులు

పెద్దకాల్వ వద్ద గ్రామస్థుల ధర్నా

గంగాధరనెల్లూరు, జూన్‌ 6: చిత్తూరు-తచ్చూరు హైవేరోడ్డు పనులకు సంబంధించి భారీ టిప్పర్లలో ఇసుక, కంకరరాళ్ళు తరలిస్తుండటంతో తారురోడ్డు ధ్వంసమవుతోందని గంగాధరనెల్లూరు మండలం పెద్దకాల్వ గ్రామస్థులు మంగళవారం ధర్నా చేశారు. ముక్కళత్తూరు, చిన్నవేపంజేరి, వేపంజేరి, వరత్తూరు, బాలగంగనపల్లె పంచాయతీల్లో కొన్నినెలలుగా హైవేరోడ్డు పనులకోసం పెద్దకాల్వ, కొట్రకోన ప్రాంతాల నుంచి భారీ టిప్పర్లతో అధికటన్నేజి బరువు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారన్నారు. దీనివల్ల తారురోడ్డు ధ్వంసమై కంకరరాళ్లు తేలిపోయి, గుంతమయంగా మారిందన్నారు. పలువురు ద్విచక్రవాహనదారులు, ట్రాక్టర్లు, కార్లు, అంబులెన్స్‌లు రాకపోకలు సాగించాలంటే ఇబ్బంది పడుతున్నామన్నారు. కనీసం హైవే రోడ్డు నిర్వాహకులు గాని, ఇసుక, కంకరరాళ్ళు కాంట్రాక్టర్లు గాని తారురోడ్డులో గుంతలు ఏర్పడినవాటికి కనీసం వాటిని పూడ్చడానికి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఏమాత్రం స్పందించకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.

Updated Date - 2023-06-07T00:15:59+05:30 IST