ఏటా జాబ్‌ కేలెండర్‌

ABN , First Publish Date - 2023-03-02T03:28:06+05:30 IST

టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా జాబ్‌ కేలెండర్‌ ఇస్తాం. మేం వచ్చిన తొలి వంద రోజుల్లోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి.

ఏటా జాబ్‌ కేలెండర్‌

రాసిపెట్టుకోండి ఇది నా హామీ..

వంద రోజుల్లోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

నాలుగు గోడల మధ్య కాదు.. ప్రజల మధ్యనే పాలసీలు

పీజీ వరకూ విద్యార్థులకు ఉచితంగా బస్‌ పాసులిస్తాం

వసతి దీవెన రద్దు.. నేరుగా కాలేజీలకే ఫీజుల చెల్లింపు

యువగళం పాదయాత్రలో లోకేశ్‌

తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా జాబ్‌ కేలెండర్‌ ఇస్తాం. మేం వచ్చిన తొలి వంద రోజుల్లోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. రాసిపెట్టుకోండి ఇది నా హామీ..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువతకు మాటిచ్చారు. యువగళం పాదయాత్ర 31వ రోజైన బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆయన నడక సాగించారు. మార్గమధ్యంలో ఇరంగారిపల్లి వద్ద యువతీ యువకులు, విద్యార్థులు లోకేశ్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన నుంచి ఏమి ఆశిస్తున్నారని వారిని లోకేశ్‌ ప్రశ్నించారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఈ 31 రోజుల పాదయాత్రతో తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం పాలసీలు రూపొందించాల్సింది నాలుగు గోడల మధ్య కాదని, ప్రజల మధ్య నుంచే వాటికి రూపకల్పన జరగాలని అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించడమనేది కేజీ నుంచీ పీజీ వరకూ మన విద్యా విధానంలో భాగం కావాలని అభిలషించారు. టీడీపీ అధికారంలోకొస్తే కేజీ నుంచీ పీజీ దాకా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామన్నారు. ఆ మేరకు స్టేట్‌ సిలబ్‌సను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే 2025 జనవరి 1న జాబ్‌ కేలెండర్‌ విడుదల చేస్తామని, తర్వాత ఏటా క్రమం తప్పకుండా జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. పీజీ వరకూ విద్యార్థులకు ఉచిత బస్‌ పాసులిస్తామని, వసతి దీవెన రద్దుచేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానాచ్చారు.

అనీషా (బీటెక్‌ విద్యార్థిని): రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న కంపెనీలు తిరిగి రావడానికి ఏం చర్యలు తీసుకుంటారు?

లోకేశ్‌: చంద్రబాబుకు ఒక ట్రాక్‌ రికార్డు ఉంది. ఆయన పేరే ఒక బ్రాండ్‌. జగన్‌ పాలన పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు ఏపీకి క్యూ కడతాయి.

మోహన్‌ (దళిత విద్యార్థి): దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

లోకేశ్‌: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తాం.

సరోజ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదు.. బస్సు చార్జీలు పెంచేశారు.. విద్యార్థుల ఇబ్బందులు తీరేదెలా?

లోకేశ్‌: మేం వస్తే ఆర్టీసీ చార్జీలు తగ్గించడంతో పాటు పీజీ వరకూ అందరికీ ఉచితంగా బస్సు పాస్‌లు అందిస్తాం.

జీవన్‌: ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోంది. మీరు గెలిస్తే అప్పు ఎలా తీరుస్తారు?

లోకేశ్‌: జగన్‌ పాలనలో అప్పు మొత్తం రూ.12 లక్షల కోట్లు దాటింది. ఉమ్మడి ఏపీలో కూడా సంక్షోభం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుది. ఆయన మళ్లీ సీఎం అయితే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారు. ఆదాయం సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సత్తా ఆయనొక్కడికే ఉంది.

శ్రీధర్‌: సీమ యువతకు ఉద్యోగాలు కల్పించిన అమరరాజా తెలంగాణకు పోవడంపై మీ అభిప్రాయం..?

లోకేశ్‌: ఎంపీ జయదేవ్‌ను పార్టీ మారమని వైసీపీ ఒత్తిడి చేసింది. ఆయన ఒప్పుకోలేదని కక్ష కట్టి వేధించారు. అందుకే అమరరాజా తెలంగాణ వెళ్లిపోయింది. దాంతో 20 వేల మంది సీమ యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు.

విద్యార్థులతో వాలీబాల్‌ ఆడిన లోకేశ్‌

పాదయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం పాకాల శివార్లలోని జడ్పీ హైస్కూలు వద్దకు చేరుకున్న లోకేశ్‌.. రోడ్డుపక్కన వాలీబాల్‌ ఆడుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. లోకేశ్‌ను చూడగానే విద్యార్థులు కరచాలనాలకు ఎగబడ్డారు. ఆయన వారితో కొద్దిసేపు సరదాగా వాలీబాల్‌ ఆడారు. ఆ తర్వాత రాత్రి 7.10 గంటలకు పాకాల పట్టణం దాటి గుమ్మడి వారి ఇండ్లు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు. లోకేశ్‌ బుధవారం 13 కి.మీ. నడిచారు. 31 రోజుల్లో 410.3 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

ఏపీలో గంజాయి మాఫియాపై

ప్రధానికి, కేంద్రానికి లోకేశ్‌ ఫిర్యాదు

తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి మాఫియాపై టీడీపీ యువనేత లోకేశ్‌ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో డైరెక్టర్‌ జనరల్‌ తదితరులకు ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో భాగంగా పాకాల మండలం ఇరంగారిపల్లిలో ఆయన యువతతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పలువురు యువకులు.. అధికారంలోకొస్తే గంజాయి మాఫియాను ఎలా అరికడతారని లోకేశ్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని సమాధానమిచ్చారు. సాయంత్రం విడిది కేంద్రానికి చేరుకున్న వెంటనే ప్రధానికి, కేంద్రంలోని సంబంధిత ఉన్నతాధికారులకు ఆయన లేఖలు రాశారు. ఏపీలో గంజాయి విచ్చలవిడి వాడకం, గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలపై వచ్చిన వార్తా కథనాలను తన ఫిర్యాదుకు జత చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విడుదల చేసిన 2021-22 స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్టు ప్రకారం డ్రగ్స్‌కు దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్టు వెల్లడైందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 2021-22లో కేవలం ఏపీలోనే 18,267 కిలోల నార్కోటిక్స్‌ సీజ్‌ చేశారని రిపోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ దందాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

400 కి.మీ. పాదయాత్ర పూర్తి

యువగళం పాదయాత్రలో భాగంగా 31వ రోజైన బుధవారం ఉదయం పాకాల మండలం గాదంకి టోల్‌గేట్‌ సమీపంలోని విడిది కేంద్రం నుంచి నడక ప్రారంభించిన లోకేశ్‌ 2.7 కి.మీ. ముందుకు వెళ్లగానే నేండ్రగుంట వద్ద 400 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పార్టీ నేతలు, గ్రామస్తులు అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నేండ్రగుంటలో పది పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, గాదం కి గ్రామంలో పెద్ద సంఖ్యలో రోడ్డుమీదికొచ్చిన బలిజలు.. లోకేశ్‌కు తమ సమస్యలు విన్నవించారు. దీనిపై స్పందించిన లోకేశ్‌ తమ ప్రభుత్వం రాగానే కాపు కార్పొరేషన్‌ను బలోపేతం చేసి భారీగా నిధులిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-02T03:28:06+05:30 IST