ప్రభుత్వంపై అంగన్వాడీల ఆగ్రహం
ABN , First Publish Date - 2023-09-26T01:41:20+05:30 IST
తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువగా వేతనం ఇస్తానని ఎన్నికల ముందు హామీనిచ్చి.. ఇప్పుడు పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై అంగన్వాడీలు ధ్వజమెత్తారు.

చిత్తూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువగా వేతనం ఇస్తానని ఎన్నికల ముందు హామీనిచ్చి.. ఇప్పుడు పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై అంగన్వాడీలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ చేపట్టిన ‘ఛలో విజయవాడ’కు వెళ్లకుండా ఆదివారం ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం.. నిర్బంధించడంపై వీరు ఆగ్రహించారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసనాగ్రహం వ్యక్తంచేశారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ.. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాగా, కుప్పంలో సుమారు 30 మంది అంగన్వాడీలు చంద్రబాబు కోసం టీడీపీ నాయకులు చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చారు. నగరిలోని టవర్‌క్లాక్ వద్ద అంగన్వాడీలు నిరసనలు చేపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాల అంగన్వాడీలు కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు పలమనేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు.