టీచర్ల బదిలీల్లో ఖాళీలన్నీ చూపాలి: ఫ్యాప్టో

ABN , First Publish Date - 2023-06-07T00:13:02+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో ఖాళీలన్నీ చూపాలని ఫ్యాప్టో రాష్ట్ర డెప్యూటీ సెక్రటరీ జనరల్‌ చిరంజీవి డిమాండు చేశారు.

టీచర్ల బదిలీల్లో ఖాళీలన్నీ చూపాలి: ఫ్యాప్టో
సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి

చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 6: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో ఖాళీలన్నీ చూపాలని ఫ్యాప్టో రాష్ట్ర డెప్యూటీ సెక్రటరీ జనరల్‌ చిరంజీవి డిమాండు చేశారు. చిత్తూరులోని ఎన్జీవో భవన్‌లో మంగళవారం జరిగిన ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్‌ టీచర్లకు సరైన స్థానాలు లభించకపోవడం దురదృష్టకరమన్నారు. బ్లాక్‌ చేసిన ఖాళీలన్నీ చూపాలన్నారు. టీచర్లకు బోధనేతర పనులను అప్పగించరాదన్నారు. సమస్యలపై చేపట్టే ఉద్యమాల్లో టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో నాయకులు మునాఫ్‌, రమేష్‌, దేవరాజులు, రమణ, గంటా మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఈవో విజయేంద్రరావుకు వినతిపత్రం అందించారు.

ఖజానా డీడీ తీరు మారాలి

జిల్లా ఖజానాధికారి తీరు మారాలని ఫ్యాప్టో నాయకులు మంగళవారం డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యలను తెలిపేందుకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులపై వెటకారపు మాటలు మాట్లాడుతూ అవమానపరిచేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. చీలాపల్లి సీఎంసీ ఆస్పత్రిలో ఉద్యోగుల హెల్త్‌ కార్డుల చెల్లుబాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై చర్చించడానికి సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కోరారు.

Updated Date - 2023-06-07T00:13:02+05:30 IST