భక్తుల కొంగుబంగారం కుప్పం గంగమ్మ!
ABN , First Publish Date - 2023-05-23T01:36:16+05:30 IST
కుప్పం గంగమ్మ జాతర మహోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. రోజుకో వాహన సేవతో ముత్తుమారెమ్మ రూపంలో సేవలందుకుంటున్న గంగమ్మ జాతరకు సంబంధించిన స్థల పురాణం బహు విచిత్రంగా, అంతకుమించి వొళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది.
ముత్తుమారెమ్మ రూపంలో పూజలు
శేష శరీరానికి నిత్య నైవేద్యాలు
నేడు గంగమ్మ శిరస్సు ఊరేగింపు
రేపు విశ్వరూప దర్శనం
కుప్పం, మే 22: కుప్పం గంగమ్మ జాతర మహోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. రోజుకో వాహన సేవతో ముత్తుమారెమ్మ రూపంలో సేవలందుకుంటున్న గంగమ్మ జాతరకు సంబంధించిన స్థల పురాణం బహు విచిత్రంగా, అంతకుమించి వొళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఖండిత శిరస్సు ఊరేగింపుతోపాటు శేష శరీరానికి వారం రోజులపాటు గంగమ్మ పూజలందుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
తలలేని మొండెం రూపంలో ఏడాది మొత్తం తెర వెనుకే ఉండిపోయే కుప్పం గంగమ్మకు.. జాతర సమయంలోనే తెర ముందుకు వచ్చే అవకాశం లభిస్తుంది. ఒకే ఒక్కరోజు శిరస్సుతో సహా సంపూర్ణ రూపంతో భక్తులకు విశ్వరూప దర్శనం ప్రసాదిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సోదరి అయిన గంగమ్మ ఉగ్ర రూపిణియైు సంచరించేది. రాత్రివేళ శ్మశానంలో ఉన్మత్త భీకర రూపంలో పరిభ్రమిస్తూ, శవాలను పీక్కుతింటున్న గంగమ్మను చూసి నాడు భక్తులు భయభ్రాంతులయ్యారు. అమె అన్న వేంకటేశ్వరునికి మొర పెట్టుకున్నారు. కోపోద్రిక్తుడైన వేంకటేశ్వరస్వామి కుప్పం వచ్చి తన విష్ణుచక్రంతో గంగమ్మ తలను తెగనరికాడు. ‘అన్నా ఏడాదికి ఒకేఒక్కసారి నన్ను ఈ లోకాన్ని చూడనివ్వు. దుందుడుకు తనంతో, రాక్షస ప్రవృత్తితో నీకు చెడ్డపేరు తేవడమేకాదు, నా భక్తులకు ఇవ్వాల్సిన వరాలు ఇవ్వలేకపోయాను. ఆదుకోవాల్సిన వారిని ఆదుకోకుండా శ్మశానాల వెంటపడి తిరిగాను. ఏడాదికోమారైనా వారికి విశ్వరూప దర్శనం ప్రసాదించి, నా భక్తులకు కొంగుబంగారంగా నిలువకలిగే వరాన్ని ప్రసాదించు’ అని తెగి నేలమీద పడ్డ శిరస్సు వేడుకుంది. ఆ ప్రకారం వేంకటేశ్వరస్వామి వరమిచ్చినట్లు పురాణోక్తి.
వారం రోజుల ఉత్సవం
అప్పట్నుంచి కుప్పం గంగమ్మ జాతరను మే నెలలో వారం రోజులపాటు భక్తులు వైభవంగా జరుపుకొంటున్నారు. శిరస్సు లేకపోవడంతో గంగమ్మ మరో రూపమైన ముత్తుమారెమ్మకు వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ నెల 18న వాహన సేవలు మొదలయ్యాయి. పల్లకీ సేవతో మొదలై శేష, సింహ, అశ్వ వాహన సేవలు జరిగాయి. సోమవారం అగ్నిగుండం, పుష్ప పల్లకీ సేవలు జరగ్గా.. ఆరో రోజైన మంగళవారం శిరస్సు ఊరేగింపు, చివరి రోజైన బుధవారం విశ్వరూప దర్శనం ఉంటుంది. కాగా, కుప్పం గంగ జాతరంటే మూడు రాష్ట్రాల వేడుక. ఏపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తజనం తరలి వస్తారు. బంధుమిత్రుల కలయికతో ఈ జాతర వసుధైక కుటుంబాన్ని తలపిస్తుంది.
నేడు శిరస్సు ఊరేగింపు
జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపు మంగళవారం జరుగుతుంది. అమ్మవారి శిరస్సు కండ్ల తెర తొలగించి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. ఆపైన అమ్మవారి శిరస్సును పట్టణ వీధుల్లో ఊరేగిస్తారు. సుమారు 25-39 గంటలపాటు జరిగే ఈ ఊరేగింపు అనంతరం శిరస్సును తీసుకొచ్చి ఆలయంలో అసంపూర్ణంగా ఉన్న అమ్మవారి మొండేనికి అమరుస్తారు. శిరస్సు ఊరేగింపు సందర్భంగా భక్తులు అమ్మవారికి బలులు సమర్పిస్తారు. దారిపొడవునా బలిజీవుల రక్తంతో వీధులు రక్తసిక్తమవుతాయి. స్థల పురాణం ప్రకారం.. వెంకటేశ్వరుడిచే ఖండితమై.. ఏడాదికోమారు పునర్జీవితురాలవుతున్న కుప్పం గంగమ్మలో నాటి రక్తదాహం తీరకుండా ఉంటుందని భక్తుల భావన. ఆమెను అలానే ఉంచేస్తే చెడు జరుగుతుందన్న ప్రచారం ఉంది. అందుకని జంతు బలులు విరివిగా సమర్పించడం వల్ల అమ్మవారిలోని రక్తదాహం తీరి, ప్రసన్నంగా మారి వరాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. కాగా, శిరస్సు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నాక.. అమ్మవారి అసంపూర్ణ రూపానికి అమరుస్తారు. ఇలా చివరి రోజైన బుధవారం అమ్మవారు భక్తులకు విశ్వరూప దర్శనం ప్రసాదించి కోరిన కోర్కెలు తీరుస్తారు. అర్ధరాత్రి తర్వాత అమ్మవారిని జలావాసం చేయించడంతో జాతర మహోత్సవాలు ముగుస్తాయి.