Share News

శబరిమలైలో దర్శనానికి 12 గంటలు

ABN , First Publish Date - 2023-12-11T00:45:07+05:30 IST

శబరిమలైలో వెలసివున్న అయ్యప్పస్వామి దర్శనంకోసం వెళ్లిన అయ్యప్ప భక్తులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.

శబరిమలైలో దర్శనానికి 12 గంటలు
దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో పడిగాపులు కాస్తున్న అయ్యప్ప భక్తులు

- గంటల తరబడి అయ్యప్ప భక్తుల నిరీక్షణ

గుడిపాల, డిసెంబరు 10: శబరిమలైలో వెలసివున్న అయ్యప్పస్వామి దర్శనంకోసం వెళ్లిన అయ్యప్ప భక్తులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో దర్శనం కోసం తరలివెళ్లారు. మామూలుగా రెండుమూడు గంటల్లో దర్శనం కావాల్సివుంది. అయితే పంబా నుంచే క్యూ పద్ధతిలో శబరిమలైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు బ్రేక్‌ కావడంతో అయ్యప్ప భక్తులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. తినడానికి తిండి లేక వందల కొద్దీ డబ్బులు వెచ్చించి తీసుకుందామన్నా అందుబాటులో లేకపోవడంతో తాగునీటితోనే భక్తులు కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలైన కన్నిస్వాముల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు త్వరగా దర్శనం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా వుండగా కేరళ రాష్ట్రం నీళకల్‌లో బస్సులను పార్కింగ్‌ చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-12-11T00:45:08+05:30 IST