‘నో మొబైల్‌ జోన్‌’గా పది పరీక్షా కేంద్రాలు

ABN , First Publish Date - 2023-04-03T01:33:58+05:30 IST

జిల్లాలోని పది పరీక్షా కేంద్రాలను నో మొబైల్‌ జోన్‌గా ప్రకటించినట్లు జిల్లా పరిశీలకుడు, విద్యాశాఖ జేడీ (సర్వీసెస్‌) మువ్వా రామలింగం తెలిపారు.

‘నో మొబైల్‌ జోన్‌’గా పది పరీక్షా కేంద్రాలు
మీడియాతో మాట్లాడుతున్న జిల్లా పరిశీలకులు మువ్వా రామలింగం

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 2: జిల్లాలోని పది పరీక్షా కేంద్రాలను నో మొబైల్‌ జోన్‌గా ప్రకటించినట్లు జిల్లా పరిశీలకుడు, విద్యాశాఖ జేడీ (సర్వీసెస్‌) మువ్వా రామలింగం తెలిపారు. సోమవారం నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆయన డీఈవో విజయేంద్రరావుతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. గతేడాది ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా పరిశీలకులతో పాటు ఏ ఒక్కరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ పాయింట్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలతో పాటు గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు, డెస్క్‌లు, తాగునీరు తదితర వాటిని సమకూర్చినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు హాల్‌ టికెట్లు తీసుకోకుంటే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 8.45 గంటల నుంచి విద్యార్థులను ఆయా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు ఎవరైనా ఆ సెంటర్‌లో, పరీక్ష విధుల్లో ఉండరాదన్నారు. ఆ తర్వాత అలాంటి వారున్నట్లు తమకు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్‌ విధించినట్లు వివరించారు. మీడియాకు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. టెన్త్‌ పబ్లిక్‌తో పాటు ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఆరుగా ఉన్న ఫ్లయింగ్‌ స్క్వాడ్లను పదికి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రెండు రిజర్వులో పెట్టామన్నారు. సమస్యాత్మకంగా భావించిన 38 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎక్కడా చిన్నపాటి పొరబాట్లు జరగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. అనంతరం సీ సెంటర్‌ కస్టోడియన్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్‌ గురుస్వామిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలకు సెలవు

పది పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు పూర్తి రోజు సెలవు దినంగా ప్రకటించినట్లు రామలింగం తెలిపారు. సోమవారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన క్రమంలో పరీక్షా కేంద్రంలోని పాఠశాలలకు సెలవు ఇచ్చామన్నారు.

టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

చిత్తూరు రూరల్‌: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినట్లు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి జితేంద్రనాథ్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. విద్యార్థులు ఇంటి నుంచి వారు రాసే కేంద్రం వరకు ప్రయాణించవచ్చన్నారు. బస్సు పాస్‌ లేకున్నా.. హాల్‌టికెట్‌ చూపిస్తే చాలన్నారు. పల్లెవెలుగు, సిటీ బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. సోమవారం నుంచి ఈ నెల 18వ తేది వరకు పబ్లిక్‌ సెలవులతో సంబంధం లేకుండా పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-04-03T01:33:58+05:30 IST