నేటినుంచి పదో తరగతి పరీక్షలు
ABN , First Publish Date - 2023-04-03T01:16:14+05:30 IST
పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ప్రథమ భాష/కాంపోజిట్ కోర్సు-1 పరీక్ష జరగనుంది. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతారణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రత్యేక పరిశీలకుడు మువ్వా రామలింగం తెలిపారు.
తిరుపతి(విద్య), ఏప్రిల్ 2: పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ప్రథమ భాష/కాంపోజిట్ కోర్సు-1 పరీక్ష జరగనుంది. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతారణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రత్యేక పరిశీలకుడు మువ్వా రామలింగం తెలిపారు. స్థానిక ఎస్వీయూ క్యాంపస్ స్కూల్‌లో ఆదివారం కస్టోడియన్లు (సీకేటగిరీ కేంద్రాలు), పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు, డీఈవో డాక్టర్ వి.శేఖర్‌తో కలసి సమావేశమయ్యారు. అనంతరం మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈనెల 18వ తేదీవరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఏసీ ఆనందరెడ్డి, కస్టోడియన్లు, ఎంఈవోలు, సీనియర్ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పరీక్ష రాస్తున్న విద్యార్థులు 28,412మంది
పరీక్ష కేంద్రాలు : 152
ఇన్విజిలేటర్లు : 1741మంది
చీఫ్ సూపరింటెండెంట్లు: 152
డిపార్టుమెంటల్ అధికారులు: 152
ఫ్లయింగ్ స్క్వాడ్స్ : ఆరు
సిట్టింగ్ స్క్వాడ్స్ : పది
సెల్‌ఫోన్లకు అనుమతి లేదు
పరీక్షలకు విద్యార్థులు సమయానికన్నా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కేంద్రాల్లో ఎవరికీ మొబైల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రశ్నపత్రంపై ఏడంకెల సీరియల్ నంబరు ఉంటుంది. ఎక్కడైనా లీకైనట్లు తెలిస్తే దాని ఆధారంగా గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
3 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు
సమస్యాత్మకంగా గుర్తించిన జడ్పీహెచ్‌ఎ్‌స(జయంపు, బాలాయపల్లి మండలం), జడ్పీహెచ్‌ఎ్‌స(చిలమాన్‌చేను, ఓజిలి), టీఎంఆర్ స్కూల్(కొత్తగుంట, చిట్టమూరు)లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
సమస్యలు తలెత్తితే..
విద్యార్థులు, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఎదురైతే 9441330952, 9866964425, 6303225862లను సంప్రదించవచ్చు.
18 నుంచి స్పాట్ వాల్యుయేషన్
తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్‌లో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల మూల్యాంకనం జరగనుంది. వారం రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా.. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో జరిగే ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 1,266మంది విద్యార్థులు, 11కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,566మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికి మధ్యాహ్నం 2.30-5.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. పోలీసు బందోబస్తు నియమించామని, హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎలక్ర్టానిక్ వస్తువులకు అనుమతిలేదన్నారు.