TTD: తిరుమల వెంకన్నకు ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-06-17T21:20:05+05:30 IST

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

TTD: తిరుమల వెంకన్నకు ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

తిరుమల: అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

రేపు ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు స్థానిక అన్నమయ్య భవనంలో సమావేశం కానున్నారు. పలు ఇంజనీరింగ్‌ పనులు, కొనుగోళ్లు, భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అన్నప్రసాదభవనం, లడ్డూకౌంటర్‌, అఖిలాండం, బస్టాండ్‌ ప్రాంతాలు రద్దీగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శ్రీకృష్ణతేజ విశ్రాంతిభవనం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 24 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్‌ టికెట్లు, టోకెన్లున్న భక్తులకు మూడు గంటల దర్శన సమయం పడుతోంది.దివ్యదర్శన టోకెన్ల కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. లగేజీని భద్రపరిచేందుకు కూడా కౌంటర్‌ వద్ద యాత్రికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Updated Date - 2023-06-17T21:20:05+05:30 IST