Avinash: అవినాశ్ ‘కాల్’తో కదిలిన తీగ!
ABN , First Publish Date - 2023-01-31T02:47:14+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది... తాడేపల్లికి ‘కనెక్ట్’ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
వేరే నంబర్ల ద్వారా భారతి, జగన్‌లకు ఎంపీ ఫోన్లు!
వివేకా హత్య జరిగిన రోజు, ఆ తర్వాత భారీగా కాల్స్
కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు
ఒకటి నవీన్ అనే వ్యక్తిది.. భారతితో కాల్స్‌కు ఆ నంబరే!
మరొక నంబర్ ద్వారా జగన్‌తో మాటామంతీ
తప్పని పరిస్థితుల్లో నోరు విప్పిన అవినాశ్ రెడ్డి
ఆ ఇద్దరికీ నోటీసులు జారీ చేసిన సీబీఐ
ఈ వారంలోనే ప్రశ్నించే అవకాశం!
అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది... తాడేపల్లికి ‘కనెక్ట్’ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. జగన్ బంధువు, మొదటి నుంచీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఈ గుట్టు రట్టయింది. ఈ తీగ ఆధారంగా డొంకను కదిలిస్తే... వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకోవడం ఖాయమని చెప్పొచ్చు. శనివారం సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు కథ ఎందుకు అల్లారు... ఇలాంటి అనేక అంశాలపై అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణ ప్రక్రియలో ఆయన ‘కాల్ డేటా’ అత్యంత కీలకంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీబీఐ అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు అవినాశ్ రెడ్డి పొడిపొడిగా సమాధానం చెప్పినా, కొన్నింటికి అసలే చెప్పకపోయినా... కాల్ లిస్ట్ విషయంలో మాత్రం తప్పించుకోలేకపోయారు.
వివేకా హత్య జరిగిన రోజు, ఆ తర్వాతా రెండు నంబర్లకు అవినాశ్ నుంచి భారీగా కాల్స్ వెళ్లాయి. ‘ఆ నంబర్లు ఎవరివి?’ అని సీబీఐ అధికారులు సూటిగా ప్రశ్నించారు. మొదట కాస్త తటపటాయించినా... ఒక నంబర్ ‘నవీన్’ అనే వ్యక్తిదని అవినాశ్ చెప్పారు. ‘ఎవరా నవీన్’ అని సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ ప్రశ్నకు అవినాశ్ కాసేపు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత చెప్పక తప్పలేదు. సీఎం సతీమణి, తన వదిన వైఎస్ భారతితో మాట్లాడాలంటే ఆ నంబర్‌కే చేయాలని చెప్పారు. వెరసి... వివేకా హత్య జరిగిన రోజున, ఆ తర్వాతా భారతితో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు సీబీఐ అధికారులు అంచనాకు వచ్చారు. ‘నవీన్ ఎక్కడుంటాడు? కడపలోనే ఉంటాడా?’ అని ప్రశ్నించినప్పుడు... ‘విజయవాడలో ఉంటాడు’ అని అవినాశ్ రెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది.

ఇంకో నంబర్ ఎవరిది?
ఎంపీని నుంచి కాల్స్ వెళ్లిన నంబర్లలో ఒకటి నవీన్‌ది! నవీన్‌కు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందో కూడా అవినాశ్ చెప్పేశారు. ఇక... మరో నంబర్ ఎవరిది? అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ‘జగన్‌తో మాట్లాడాలంటే... ఈ ఫోన్ నంబర్‌కే కాల్ చేస్తాను’ అని ఎంపీ బదులిచ్చినట్లు సమాచారం. వెరసి... వివేకా హత్య జరిగిన రోజు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి అటు జగన్‌తో, ఇటు భారతితో ఇంకొకరి నంబర్లకు కాల్ చేసి పలుమార్లు మాట్లాడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. నవీన్‌తోపాటు ఆ ఇంకొకరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. బహుశా ఈ వారంలోనే వీరిద్దరినీ ప్రశ్నించే అవకాశముంది. వీరి నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు? దొరికిన తీగ ఆధారంగా డొంక కదులుతుందా? అనేది చూడాలి.
ఎందుకంత ఆందోళన?
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూ అనేక అనుమానాలు ముసురుకున్నాయి. వారి పాత్ర ఏమిటి, ఎంత వరకు ఉందో నిర్ధారించుకునేందుకు సీబీఐ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ... ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరికి... శనివారం తొలిసారిగా ఎంపీని సీబీఐ ప్రశ్నించింది. నిజానికి... ఈ కేసులో ఇప్పటికి 278 మందిని సీబీఐ విచారించింది. అలాగే... అవినాశ్ రెడ్డికీ నోటీసులు ఇచ్చింది. నిజానికి... స్వయంగా ఎంపీ హోదాలో ఉండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ‘నా తమ్ముడు’ అని వెనకేసుకొచ్చిన వ్యక్తికి సీబీఐ నోటీసులు ఇచ్చినంత మాత్రాన భయమూ, బెరుకూ ఉండక్కర్లేదు. కానీ... విచారణకు సంబంధించి అవినాశ్ రెడ్డి అనేక భయాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి జగన్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు వెలువడ్డాయి. వాటికి ఇప్పుడు బలం చేకూరుతోంది.