Atchennaidu : చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారు
ABN , First Publish Date - 2023-11-04T11:52:04+05:30 IST
ఏపీలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు.
అమరావతి : ఏపీలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను జగన్ రెడ్డి మోసం చేశారన్నారు.
లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్‌లో చర్చించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు. వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు జగన్ రెడ్డి దోపిడీ పరిపాలనే కారణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.