బియ్యం ధరలు భగ్గు

ABN , First Publish Date - 2023-03-31T03:17:57+05:30 IST

రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని గొప్పలు చెప్పారు. సన్న బియ్యానికి బదులు నాణ్యమైన బియ్యం అందజేస్తామని ఆ తర్వాత బీరాలు పలికారు.

బియ్యం ధరలు భగ్గు

మార్కెట్లో సన్నరకాల ధరలు పైపైకి

పంపిణీలో చేతులెత్తేసిన జగన్‌ సర్కారు

నెలలోనే కిలోకు రూ.10 పెరుగుదల

25 కిలోల సోనా మసూరి ప్యాకెట్‌ 1400

పేద, మధ్యతరగతి వర్గాలు గగ్గోలు

రాష్ట్రంలో తగ్గిపోతున్న సన్నరకాల సాగు

మరోవైపు మార్కెట్లో కృత్రిమ కొరత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని గొప్పలు చెప్పారు. సన్న బియ్యానికి బదులు నాణ్యమైన బియ్యం అందజేస్తామని ఆ తర్వాత బీరాలు పలికారు. ఆ బియ్యాన్నైనా ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేస్తోందా? అంటే.. అదీ లేదు. ఎప్పటిలాగే ముతకరకం బియ్యం ఇస్తోంది. పేదలు సైతం వాటిని తినడానికి ఇష్టపడటం లేదు. ముతకరకం బియ్యాన్ని తీసుకోకుండా తిరిగి రేషన్‌ వాహనాల నిర్వాహకులకే కిలో రూ.8 నుంచి రూ.10కు అమ్మేస్తున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నెలలోనే కిలోకు రూ.10 దాకా ధర పెరిగింది. బియ్యం ధరలు చూస్తే ‘కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ధరలు ఆకాశానికి...

రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో సన్న బియ్యం విక్రయిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలోనే కిలోకు రూ.15 నుంచి 20 వరకు ధరలు పెరిగిపోయాయని బియ్యం వ్యాపారులే చెబుతున్నారు. విజయవాడలో కర్నూలు సోనా మసూరి నెంబర్‌ వన్‌ రకం బియ్యాన్ని కిలో రూ.54కు అమ్ముతున్నారు. సోనా మసూరిలోనే ప్రీమియం, న్యూ ప్రీమియం పేర్లతో రెండో రకం బియ్యం ధర కిలో రూ.46 నుంచి 48.50 వరకు ఉంది. మూడో రకం బియ్యాన్ని కిలో రూ.42-44 వరకు అమ్ముతున్నారు. ఇక బిర్యానీ, పలావు తదితర ప్రత్యేక వంటకాలకు వినియోగించే బాస్మతి, ఇతర మేలు రకం బియ్యం ధరలు కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయి. చివరికి నాసిరకం బియ్యం, నూకలు సైతం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. గత ఏడాదితో పోలిస్తే బియ్యం ధరలు దాదాపు సగానికి పైగా పెరిగాయి. గతంలో సోనా మసూరి సన్నబియ్యం 25 కిలోల ప్యాకెట్‌ ధర రూ.900 ఉండగా, ఇప్పుడు రూ.1400 దాటిపోయింది. కర్నూలు సోనా మసూరి బియ్యం ధరలు క్వాలిటీని బట్టి 25 కిలోల ప్యాకెట్‌పై రూ.400 నుంచి 500 వరకు ధర పెరిగింది. ఇక హెచ్‌ఎంటీ, ఇతర సన్న రకాల బియ్యం ధరలు కూడా సగానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు లేని అన్‌సీజన్‌లో కూడా బియ్యం ధరలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు సన్నరకం బియ్యం కొనాలంటే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.

సన్నరకానికి భారీ డిమాండ్‌

సన్నబియ్యం ధరలు పెరగడానికి మిల్లర్లు, మధ్యవర్తులు, దళారులే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సన్నరకాల వరి సాగు గణనీయంగా తగ్గడం వల్లే ధరలు పెరిగాయనే వాదన కూడా ఉంది. ముతక రకం వరి పంటకు పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉండటంతో రైతులు ఈ దిశగా మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 శాతం విస్తీర్ణంలో ముతక రకాలనే పండిస్తున్నారు. రాయలసీమలోని కర్నూలు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న సన్న రకాల ధాన్యానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వరి కోతలు పూర్తి కాగానే రైసు మిల్లర్లు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములలో నిల్వ చేసుకుంటున్నారు. సీజన్‌ అయిన తర్వాత సన్న బియ్యాన్ని పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసుకుంటూ రూ.కోట్లలో లాభాలు గడిస్తున్నారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కృత్రిమ కొరతను సృష్టిస్తూ బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుండటంతో గత మూడు నెలలుగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు బాస్మతి బియ్యం తరహాలో సన్న బియ్యం కూడా ధనవంతులు తినే బియ్యంగానే మారుతుందంటున్నారు. చాలామంది వ్యాపారులు పాత బియ్యం పేరుతో స్టీమ్డ్‌ రైస్‌ను మసూరి బియ్యం ధరలకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి సన్నరకం బియ్యాన్ని సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ధరలు తగ్గించాలి

‘పట్టణాలు, నగరాల్లో ఇంటి అద్దె రూపంలోనే నెలకు రూ.8,000 నుంచి 10,000 పోతుంది. పెట్రోలుకు నెలకు రూ.5,000 అవుతుంది. జీతంలో మిగిలిన రూ.5,000తో నెలంతా తినడానికి సరిపోవడం లేదు. గతంలో 25 కేజీల సన్నబియ్యం ప్యాకెట్‌ రూ.800 నుంచి 900కు లభించేది. ఇప్పుడు అదే ప్యాకెట్‌ ధర రూ.1300 నుంచి 1500 వరకు పెరిగింది. నలుగురైదుగురు కుటుంబ సభ్యులుంటే నెలకు కనీసం 2 బియ్యం ప్యాకెట్లు కొనాల్సి వస్తుంది. ఇక నూనెలు, పప్పులు, కూరగాయలు, పాలు, పెరుగు.. అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే రాబోయే రోజుల్లో సామాన్యులు సన్నబియ్యంతో అన్నం వండుకుని, కూరలతో తినే పరిస్థితులు ఉండవు. పేదల బాధలు ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఇప్పటికైనా బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’. - విజయవాడకు చెందిన ఓ చిరుద్యోగి

సమాధానం చెప్పలేకపోతున్నాం

‘గత నెలలో మేలు రకం సన్నబియ్యం కిలో రూ.44 ఉండేది.. ఇప్పుడు రూ.54కు పెరిగింది. గతంలో రూ.900కు విక్రయించిన 25 కేజీల బియ్యం ప్యాకెట్‌ను ఇప్పుడు రూ.1400 పైగా అమ్మాల్సి రావడం మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తులో బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు. వచ్చే నెలలో కిలో బియ్యం రూ.60 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత నెల కంటే ఇప్పుడు బియ్యం ధరలు ఎందుకు పెరిగాయంటూ కస్టమర్లు నిలదీస్తుంటే వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం. మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసిన బిల్లులు చూపిస్తున్నా నమ్మడం లేదు. బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి ఏర్పడింది’.

- విజయవాడకు చెందిన ఓ బియ్యం వ్యాపారి

Updated Date - 2023-03-31T03:17:57+05:30 IST