‘ఫెర్రో’... వర్రీ...

ABN , First Publish Date - 2023-03-31T04:04:25+05:30 IST

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఊసు లేదు. ఉన్నవి మూసేసుకోవలసిన పరిస్థితి.

‘ఫెర్రో’... వర్రీ...

నూతన విద్యుత్‌ టారి్‌ఫలో పరిశ్రమపై భారం

300 కోట్ల ఆదాయం కోసం ఎండీ చార్జీలు విధింపు

ఇప్పటికే ఉత్పత్తి వ్యయంలో ఇంధనానికే 70ు

ప్రస్తుతమున్న యూనిట్‌ ధరలో 50ు పెరుగుదల

టన్నుకు 10 వేలు అదనపు భారం. మూసేసుకోవాల్సిందే

అదే జరిగితే... 3000 కోట్ల ఆదాయం హుష్‌కాకి

40,000 కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఊసు లేదు. ఉన్నవి మూసేసుకోవలసిన పరిస్థితి. ఇప్పటికే పంచదార, జ్యూట్‌ ఫ్యాక్టరీలు సరైన ప్రోత్సాహం అందక మూతపడ్డాయి. ఇప్పుడు ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమల వంతు. ఇటీవల ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి కొత్త (2023-24) విద్యుత్‌ టారి్‌ఫలను విడుదల చేసింది. దానిలో అన్ని రంగాలను మినహాయించి కేవలం ఒక్క ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలపైనే భారం వేసింది. మినిమం డిమాండ్‌ చార్జీలను కిలోవాట్‌కు రూ.475గా నిర్ణయించింది. దీనివల్ల ఏడాదికి రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రకటించింది. ఈ చర్యను ఫెర్రో ఎల్లాయిస్‌ వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. రూ.300 కోట్ల ఆదాయం కోసం చూసుకుంటే ఈ భారం మోయలేక పరిశ్రమలు మూతపడతాయని, దానివల్ల ఏడాదికి విద్యుత్‌ సంస్థలకు రూ.3,000 కోట్ల ఆదాయం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నాయి. 32 పరిశ్రమలు... 40 వేల కుటుంబాలు రాష్ట్రంలో 38 ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు ఉండగా, వాటిలో ప్రస్తుతం 32 నడుస్తున్నాయి. ఇవి నెలకు 1.2 లక్షల టన్నుల సిలికో మాంగనీస్‌, ఫెర్రో క్రోమ్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నెలకు రూ.216 కోట్లు జీఎ్‌సటీ రూపంలో వెళుతోంది. సగం ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వాటి ద్వారా నెలకు రూ.600 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. విద్యుత్‌ చార్జీల భారం మోయలేక ఈ పరిశ్రమలు మూతపడితే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోవడంతో పాటు ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న 40 వేల కుటుంబాలు రోడ్డున పడతాయి.

ఉత్పత్తి వ్యయంలో విద్యుత్‌ వాటానే అధికం

ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమల ఉత్పత్తి వ్యయంలో 35 నుంచి 70 శాతం విద్యుత్‌ వాటానే ఉంటుంది. ఇవి 24 గంటలూ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. వీటిని ‘ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీ’గా వ్యవహరిస్తారు. వీటి అవసరాన్ని 2002లో గుర్తించిన ప్రభుత్వాలు ఎన్‌టీపీసీ ద్వారా విద్యుత్‌ను అందిస్తూ వచ్చాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని పెట్టి మినిమం డిమాండ్‌ (ఎండీ) చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) లేకుండా పరిశ్రమల మనుగడకు సహకరిస్తూ వచ్చాయి. 2002 నుంచి 2012 వరకు వీటి నుంచి యూనిట్‌కు రూ.2.12 నుంచి రూ.2.40 వరకు చార్జీలు వసూలు చేశారు. దాంతో అప్పట్లో కేవలం ఆరు మాత్రమే ఉన్న పరిశ్రమలు 38కి పెరిగాయి. ఆ తరువాత రూ.4.95 చేశారు. గత పదేళ్ల నుంచి ఈ చార్జీలే వసూలు చేస్తున్నారు. 2012లో ఎలక్ర్టిసిటీ డ్యూటీ(ఈడీ)ని కొత్తగా ప్రవేశపెట్టారు. యూనిట్‌కు ఆరు పైసల చొప్పున వసూలు చేస్తుండగా గత ఏడాది అంటే 2022 ఏప్రిల్‌ 8న ఈడీని యూనిట్‌కు 100 పైసలు చేశారు. అంటే 94 పైసలు పెంచారు. ‘‘2002లో తీసేసిన డిమాండ్‌ చార్జీలను మళ్లీ ఇప్పుడు తెర పైకి తెచ్చి ఈ ఏప్రిల్‌ నుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల యూనిట్‌పై 80 పైసల నుంచి 90 పైసలు అదనపు భారం పడుతుంది. ఇది చాలా అధికం. వీటితోపాటు ట్రూ అప్‌ చార్జీలు, ఎఫ్‌పీపీసీఏ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూనిట్‌ చార్జీ రూ.4.95 ఉండగా ఈ భారాలన్నీ కలిపి రూ.7.35కి చేరుతుంది. అంటే యూనిట్‌ వ్యయం 50 శాతం పెరుగుతుంది. దీనివల్ల టన్నుకు రూ.10 వేలు అదనపు భారం పడుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎండీ, ఈడీలు తగ్గిస్తే చాలు

‘‘విద్యుత్‌ చార్జీల్లో అదనంగా వేసిన ఎండీ, ఈడీలను మాత్రమే తగ్గించాలని కోరుతున్నాము. ఈడీ ఆరు పైసలు ఉండేది. 100 పైసలు చేశారు. పూర్వపు రేటే వసూలు చేయాలి. అలాగే ఎండీ చార్జీలు రద్దు చేయాలి. మిగిలిన ట్రూఅప్‌ చార్జీలు, ఎఫ్‌పీపీసీఏ చార్జీలు కట్టడానికి మేము సుముఖం’’

- ఎంఎస్ఎస్ శర్మ, ప్రధాన కార్యదర్శి, ఏపీ ఫెర్రో అసోసియేషన్‌

ప్రత్యామ్నాయం లేదు... మూసుకోవలసిందే

విశాఖలో పోర్టు ఉంది కాబట్టి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి, ఉత్పత్తుల ఎగుమతికి అనువుగా ఉందని ఉత్తరాంధ్రాలో ఈ పరిశ్రమలు ఎక్కువగా పెట్టారు. ప్రభుత్వం చార్జీల తగ్గించి సహకరించకపోతే పరిశ్రమలను మూసివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

- పీఎస్‌ఆర్‌ రాజు, ఉపాధ్యక్షులు, ఏపీ ఫెర్రో అసోసియేషన్‌

Updated Date - 2023-03-31T04:04:25+05:30 IST