ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

ABN , First Publish Date - 2023-03-31T03:59:33+05:30 IST

పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ కార్యాలయంలో పాలన పడకేసింది. పెండింగ్‌ ఫైళ్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

పీఆర్‌ ఈఎన్‌సీలో పడకేసిన పాలన

పెండింగ్‌ ఫైళ్లతో నిండిపోతున్న కార్యాలయం

ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో సగానికిపైగా పోస్టులు ఖాళీ

సెలవు బిల్లులూ మంజూరు కాక ఉద్యోగుల గగ్గోలు

నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈఎన్‌సీ

ఆందోళనలో పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ కార్యాలయంలో పాలన పడకేసింది. పెండింగ్‌ ఫైళ్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. ఉద్యోగుల సెలవు మంజూరు బిల్లులు సైతం పాస్‌ కాకపోవడంతో జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ప్రధాన కార్యాలయంలోని ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో సగానికి పైగా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటమే దీనికి కారణం. పెండింగ్‌ ఫైళ్లతో కార్యాలయం నిండిపోతోంది. పలు అంశాలపై నిర్ణయం తీసుకునే విషయంలో ఈఎన్‌సీ తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ సర్కార్‌ వచ్చినప్పటి నుంచి పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగం పట్ల అడ్డగోలుగా వ్యవహరించడంతో ఆ కార్యాలయం దిక్కూదిశ లేనిదిగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. జగన్‌ సర్కార్‌ వచ్చీ రాగానే ఈఎన్‌సీ నియామకం విషయంలో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. సీనియారిటీలో ఐదో స్థానంలో ఉన్న అధికారిని ఈఎన్‌సీగా నియమించి నాలుగేళ్లు కొనసాగించడంతో కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. అడ్డగోలుగా బదిలీలు, పదోన్నతులు నిర్వహించారు. గతంలో భారీగా సిమెంట్‌ రోడ్లు నిర్వహించిన ఇంజనీర్లను వేధించడం ప్రారంభించారు. విజిలెన్స్‌ తనిఖీల పేరుతో బెదిరిస్తూ కంటికి కునుకు లేకుండా చేశారు. ఇటీవల ఓ నిజాయితీ అధికారిని ఈఎన్‌సీగా నియమించినప్పటికీ, ఆ తర్వాత కూడా ఒక్క పనీ కావడం లేదని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. సర్వీసు అంశాలు చూడాల్సిన ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా ప్రతి పనీ నత్తనడకన సాగుతోంది. ప్రతి జోన్‌కు సంబంధించి సూపరింటెండెంట్‌, నాన్‌ టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌(ఎన్‌టీపీఏ), ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు తదితర సిబ్బంది ఉంటేనే ఆ జోన్‌లో ఉద్యోగుల సర్వీసు అంశాలు పరిష్కరించే వీలుంటుంది. జోన్‌-1లో ప్రధానమైన సూపరింటెండెంట్‌ పోస్టు సైతం ఖాళీగా ఉంది. సూపరింటెండెంట్‌పై ఆరోపణలు ఉండటంతో ఆయనను ఈఎన్‌సీ శ్రీకాకుళానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో ఒక్క పనీ ముందుకు సాగడం లేదు. ఇదే జోన్‌లో ఎన్‌టీపీఏ పోస్టు కూడా ఖాళీగా ఉంది. జోన్‌-2లోనూ సూపరింటెండెంట్‌, ఎన్‌టీపీఏ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక్కరితోనే నడుపుతున్నారు. జోన్‌-3లో ఇటీవల ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను అనంతపురం బదిలీ చేశారు. మరొకరు సెలవుపై అమెరికా వెళ్లేందుకు సిద్ద్ధమయ్యారు. ఈ జోన్‌కు సూపరింటెండెంట్‌ ఒక్కరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. జోన్‌-4లోనూ ఎన్‌టీపీఏ లేకపోవడంతో ఒక్క ఫైల్‌ కూడా ముందుకు సాగడం లేదంటున్నారు.

రోజుల తరబడి పడిగాపులు..

ఈఎన్‌సీ కార్యాలయంలో ఇంజనీర్ల సర్వీసు సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీర్లు ప్రధాన కార్యాలయానికి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉద్యోగుల సెలవుల మంజూరు విషయంలోనూ విపరీతమైన జాప్యం జరిగి, సెలవు పెట్టిన పలువురు ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనుల కోసం ప్రధాన కార్యాలయానికి వచ్చినఉద్యోగులకు విజయవాడలో బసచేసేందుకు అదనంగా ఖర్చవుతోందంటున్నారు. కొంత మంది నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగులకు 6, 12, 18 సంవత్సరాలకు సర్వీసును బట్టి రావాల్సిన ఇంక్రిమెంట్లను మంజూరు చేసే దిక్కు కూడా లేదని వాపోతున్నారు. వాటికి సంబంధించి ఫైల్‌ నడిపే వ్యవస్థ చురుకుగా పనిచేయకపోవడం, వారు చేసినా ఆమోదించడంలో ఈఎన్‌సీ జాప్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పలువురు ఉద్యోగులకు ప్రొబేషన్‌ కాలం ముగిసినా ప్రొబేషన్‌ ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏఓ ఒక్కరే ఉండటంతో ఆయనకు కోర్టు కేసులు పరిష్కరించడానికే సమయం సరిపోతోంది. ఇతర పనులపై ఆయన దృష్టి సారించలేకపోతున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో సుమారు వెయ్యి మంది దాకా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ ప్రతి నెలా జీతాలు రావడం లేదు. నాలుగైదు నెలలకోసారి జీతాలు వస్తున్నా, చొరవ తీసుకుని నెలనెలా జీతాలొచ్చేలా చేయడంలో ఈఎన్‌సీ విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-03-31T03:59:33+05:30 IST