ఏం సాధించారు..?

ABN , First Publish Date - 2023-03-31T03:57:47+05:30 IST

‘‘ఉద్యోగులకు జీతాలు లేవు. ఏ ఒక్కరూ సుఖశాంతులతో లేరు.

ఏం సాధించారు..?

రంగులు వేయడం, పేర్లు మార్చడం తప్ప?

జగన్‌ పాలనపై ఎంపీ రఘురామరాజు ధ్వజం

న్యూఢిల్లీ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగులకు జీతాలు లేవు. ఏ ఒక్కరూ సుఖశాంతులతో లేరు. భవనాలకు రంగులు వేయడం, పార్కులు, బస్టాండ్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు పేర్లు మార్చడం తప్ప రాష్ట్రంలో సాధించింది ఏముంది?’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటివరకు సరైన లెక్కలు లేవు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడి చేస్తున్నారు. ఒక వ్యవస్థ బాగుపడాలన్నా సర్వనాశనం కావాలన్నా... పాలకుల పైనే ఆధారపడి ఉంటుంది. పాలకులు మంచివారైతే ఉత్తరప్రదేశ్‌ తరహాలో వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా దరిద్రంగా మారుతుంది. ముఖ్యంమంత్రి పాలనా దక్షతకు యూపీ నిదర్శనం అయితే, రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించడంలో జగన్‌ పాలనా దక్షత కనిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా జగన్‌ చేసిన ట్విట్‌ చూస్తే నవ్వు వచ్చింది. రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రత్యేక విమానాలలో కేసుల మాఫీ కోసమే తిరుగుతున్నారు. హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ముఖచిత్రం దోషిలా మారిపోయిందని చూసినవారు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిర్మలా సీతారామన్‌కు తెలియదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావించడం విడ్డూరంగా ఉంది. సహచర శాసన సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వకుండా, ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానిస్తున్నారో, అంతకు రెండింతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్‌ ఇవ్వకుండా అవమానించారు. శ్రీరామ నవమి రోజున సీఎం జగన్‌ ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ చుట్టు అప్పుల కోసం ప్రదక్షిణలు చేయడం రాష్ట్ర ప్రజల కర్మ. ఆయన ఢిల్లీ పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల మంచే జరుగుతుంది. కేసు విచారణ అధికారిగారిగా ఎవరు ఉన్నా, సీబీఐ ఇప్పటికే చెప్పినట్లుగా ఆ ఇద్దరి అరెస్టులు తప్పవు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా 30 రోజులలోపు చార్జిషీట్‌ దాఖలు చేసి మరికొంత సమయం కావాలని అడిగితే ఇస్తారా? ఇవ్వరా? అన్నది చూడాలి. జగనన్న ఆసరా పథకానికి విద్యుత్‌ ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ బాండ్లను కుదవ పెట్టదారుణం. సొమ్మేమో విద్యుత్‌ ఉద్యోగులదైతే, సోకు జగన్మోహన్‌రెడ్డిది’’ అని రఘురామరాజు మండిపడ్డారు.

Updated Date - 2023-03-31T03:57:47+05:30 IST