రేపటి నుంచి ఆప్కాబ్‌లో కొత్త సర్వీస్‌ చార్జీలు

ABN , First Publish Date - 2023-03-31T03:45:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌) ఖాతాదారులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీస్‌ చార్జీలు అమలు కానున్నాయి.

రేపటి నుంచి ఆప్కాబ్‌లో కొత్త సర్వీస్‌ చార్జీలు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌) ఖాతాదారులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీస్‌ చార్జీలు అమలు కానున్నాయి. కరెంట్‌ అకౌంట్‌లో రూ.2,000, చెక్‌బుక్‌ లేని ఎస్‌బీ అకౌంట్‌లో రూ.500, చెక్‌ బుక్‌ ఉన్న ఎస్‌బీ అకౌంట్‌లో కనీసం రూ.1,000 ఉండాలని ఆప్కాబ్‌ నిర్దేశించింది. గతంలోనూ ఇవే నిబంధనలు ఉండగా ఇక నుంచి వీటిని ‘నెలలో సగటున...’ అనే నిబంధనను అమలు చేయనున్నది. ప్రభుత్వ పెన్షనర్లకు చెక్‌బుక్‌తో నిమిత్తం లేకుండా గతంలో రూ.100 కనీస బ్యాలెన్స్‌ ఉండాలన్న నిబంధన ఉండేది. దానిని సడలించి జీరో బ్యాలెన్స్‌కు అనుమతించింది. కరెంట్‌ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్‌ లేకపోతే గతంలో ఏడాదికి రూ.300, జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. తాజా మార్పుతో త్రైమాసికానికి రూ.150, జీఎస్టీ చెల్లించాలని పేర్కొంది. చెక్‌బుక్‌ లేని ఎస్‌బీ అకౌంట్లకు త్రైమాసికానికి రూ.50, జీఎస్టీ వసూలు చేస్తామని, చెక్‌బుక్‌ ఉంటే రూ.100, జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పని చేయని ఖాతాలపై గతంలో ఉన్న చార్జీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త, డూప్లికేట్‌ ఏటీఎం, డెబిట్‌ కార్డుల కోసం రూ.150, జీఎస్టీ వసూలు చేయనున్నట్లు ఆప్కాబ్‌ పేర్కొంది. రిటైల్‌, గోల్డ్‌ లోన్‌ నోటీస్‌ చార్జీలనూ స్వల్పంగా పెంచింది.

Updated Date - 2023-03-31T03:45:08+05:30 IST