ఇతర సంఘాల కుమ్ములాటలతో సంబంధం లేదు
ABN , First Publish Date - 2023-05-26T03:38:22+05:30 IST
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమాలు ..

సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిచి పరిష్కరించాలి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
విజయవాడ (వన్‌టౌన్), మే 25: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమాలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయని ఆంధ్రప్రదేఽశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది జిల్లాల్లోని పది తాలూకా కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు జరిగాయని, గురువారం చిత్తూరు, అన్నమయ జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆయా తాలూకా కేంద్రాలకు వందలాది మంది ఉద్యోగులు తరలివస్తుంటే కొన్ని సంఘాలు మాత్రం బాధ్యత మరచి వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకటో తేదీనే జీతాలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రక్షణ కల్పించడం, పదవీ విరమణ అనంతరం పెన్షనర్లకు ప్రయోజనాలు, బకాయిలు చెల్లించాలని కోరడం ప్రభుత్వానికి తప్పులా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర సంఘాల కుమ్ములాటతో తమకు సంబంధం లేదని, తాము ఉద్యోగుల సంక్షేమానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.