వైసీపీ మార్క్‌డ్‌ పాలన

ABN , First Publish Date - 2023-05-02T00:17:10+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు అన్ని సంక్షేమ పథకాలను ఎత్తేసిందని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా, అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

వైసీపీ మార్క్‌డ్‌ పాలన
ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ల సముదాయం

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు విడుదల కాని ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌

ఇప్పటికే పలుమార్లు జడ్పీకి ఈడీల నివేదికలు

తాజాగా జడ్పీకి రూ. 1.5 కోట్లు నిధులు...?

అయినా చిల్లిగవ్వ విదల్చని వైనం

రెండు కార్పొరేషన్లకు పేరుకుపోయిన బకాయిలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే 1: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు అన్ని సంక్షేమ పథకాలను ఎత్తేసిందని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా, అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేని కారణంగా ఆయా కార్పొరేషన్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. జడ్పీ నుంచి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు అందించే ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ విషయంలోనూ నాలుగేళ్లుగా అదే నిర్లక్ష్యం, ఉదాసీనత కనబరుస్తుండటంతో ఆ వర్గాలు మరింత నిరాశాలో మునిగిపోయాయి. తాజాగా జడ్పీకి దాదాపు రూ. 1.5 కోట్లు నిధులు వచ్చినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల అధికారులు సైతం తమకు ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ మంజూరు చేయాలని నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అయినా... ఆ ఫైళ్లకు ఆమోద ముద్ర పడటం లేదు. తాజాగా జరిగిన జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఏ ఒక్క అధికారిగానీ... ప్రజాప్రతినిదులుగానీ నోరుమెదపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

కమీషన్ల కోసమేనా...?

కార్పొరేషన్లకు అందించే ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ విడుదలలో జిల్లా పరిషతలోని ఓ అధికారి ఫైలును ముందుకు కదపాలంటే తన చేతులు తడపాల్సిందేనని కార్పొరేషన్ల అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల అధికారులు పంపిన నివేదికలు పైస్థాయికి వెళ్లకుండా నిలిపేస్తూ వచ్చినట్లు సమాచారం. ఒక్కో కార్పొరేషనకు ఒక్కో రేటుతో కమీషన్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా కార్పొరేషన్ల అధికారులు ఫండ్‌ ఎంతొస్తుందో తెలీదు... అందులో ఆ అధికారి అడిగినంత ఇచ్చుకోలేక మిన్నకుండిపోతూ వస్తున్నట్లు సమాచారం. తాజాగా... ఆ నిధులు మంజూరుకు ఓ ప్రజాప్రతినిధి సైతం ఆమోదం వేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు కార్పొరేషన్లు... రూ. 1.3 కోట్లు బకాయిలు..

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు జడ్పీ నుంచి అందే ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌తో రుణాలు అందించడం, అభివృద్ధి పనులు చేపట్టేవారు. అయితే ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ నాలుగేళ్లుగా అందకపోవడంతో చేసిన పనులకు దాదాపు రూ. 1.30 కోట్లకుపైగా బకాయిలున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది కార్పొరేషన్ల ఈడీల నుంచి ఫైలు వెళ్లడం... అవి జడ్పీలోని చెత్తబుట్టల్లోకి వెళ్తుండటంతో ఈ పరిస్థితులు దాపురించాయన్న విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2023-05-02T00:17:10+05:30 IST