ప్రభుత్వ భూమిపై వైసీపీ గద్దలు!
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:37 AM
ప్రభుత్వ భూమిపై వైసీపీ గద్దలు వాలాయి. విలువైన భూమిని కాజేసేందుకు కుతంత్రాలు రచిస్తున్నాయి. రూ.36 కోట్ల విలువైన భూమిని మింగేందుకు చకచకా పావులు కదుపుతున్నాయి. దీనివెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఉండి.. చోటా మోటా నాయకుల ద్వారా తతంగం నడిపిస్తున్నట్లు ఆయావర్గాల్లో చర్చ సాగుతోంది.
రూ.36కోట్ల భూమిని కాజేసే కుట్ర
రికార్డులు తారుమారు
అదే భూమిలోనే ఓ సామాజికవర్గానికి పట్టాలు..
అవి కూడా రద్దు..
భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ మీనమేషాలు
తెరవెనుక తతంగం నడిపిస్తున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు
ప్రభుత్వ భూమిపై వైసీపీ గద్దలు వాలాయి. విలువైన భూమిని కాజేసేందుకు కుతంత్రాలు రచిస్తున్నాయి. రూ.36 కోట్ల విలువైన భూమిని మింగేందుకు చకచకా పావులు కదుపుతున్నాయి. దీనివెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఉండి.. చోటా మోటా నాయకుల ద్వారా తతంగం నడిపిస్తున్నట్లు ఆయావర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు అటువైపు తొంగిచూడడం లేదు. భూమిని స్వాధీనం చేసుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురంరూరల్ మండలం కురుగుంట పరిధి సర్వే నంబరు 41లో 21.82 ఎకరాల భూమి ఉంది. దానిని 1977లో ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వం తీసుకుంది. ఇరవైౖ ఏళ్ల క్రితం ఆ భూమి యజమానులు అదే గ్రామ సర్వే నంబరులోని తమకు సంబంధించిన తడి భూమి నాలుగెకరాలు ప్రభుత్వానికి రాసిచ్చి, సర్వే నంబరు 41లోని సీలింగ్ భూమిలో 9 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. ఆ తరువాత వారు దానిని ఇతరులకు విక్రయించేశారు. 9 ఎకరాలుపోను 12.81 ఎకరాల భూమి అలానే ఉండిపోయింది.
- అనంతపురం రూరల్
ఓ సామాజికవర్గానికి పట్టాలు..
మిగిలిన భూమిలో ఓ సామాజిక వర్గానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. 2010లో ఏప్రిల్‌లో 153 మందికి, 2013 మార్చిలో 143 మందికి పట్టాలు ఇచ్చారు. రెండుదఫాలుగా మొత్తం 7.43 ఎకరాల్లో 290 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు తీసుకున్నారన్న మాటేకానీ, నాలుగైదేళ్ల కిందటి వరకు కూడా వారు భూమిలోకి వెళ్లిందిలేదు. పట్టాలు జారీ చేసిన రెవెన్యూ అధికారులే వాటిని కొన్ని నెలలకే రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక 2013లో ఇచ్చిన పట్టాల్లో చాలా వాటికి తహసీల్దార్ సంతకం సైతం లేదన్న విషయం సంబంధిత రెవెన్యూ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ సామాజిక వర్గ సభ్యులు పట్టాలు తీసుకుని, కోర్టును ఆశ్రయించారు.
కాజేసేందుకు కుట్ర..
స్థానికంగా ఉన్న 21.82 ఎకరాల్లో 9 ఎకరాలు భూమి యజమానులకు పోయింది. మిగిలిన 12.82 ఎకరాల్లో ఓ సామాజికవర్గానికి 7.43 ఎకరాల భూమిలో ఇచ్చిన పట్టాలు రద్దు అయ్యాయి. దీనిని అదునుగా చేసుకుని వైసీపీ నాయకులు భూమిని కాజేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సబ్ డివిజన స్కెచలు కూడా మార్చినట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు, నాలుగు రోజులుగా భూమి చదును, చుట్టూ ప్రహారీ నిర్మాణ పనులు చేపడు తున్నారు. ఇంతలోనే పట్టాలు పొందిన సామాజికవర్గం వారు అక్కడికి చేరుకుని, అడ్డుకోవడంతో విషయం బయటకు పొక్కింది.
నాయకుడి డబుల్ గేమ్
భూవ్యవహారంలో తనను నమ్ముకున్న వర్గాన్నే నాయకుడు మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టాలు పొందిన సామాజిక వర్గంలోని ఓ నాయకుడు.. అధికార పార్టీ వారితో కుమ్మక్కయినట్లు ఆయా వర్గాల్లో చర్చ సాగుతోంది. నోరు మెదపకుండా ఉండేందుకు భారీ మొత్తంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే సామాజికవర్గం వారితో కలిసి నిరసనలో పాల్గొంటూనే.. నమ్ముకున్న వర్గానే మోసం చేస్తున్నడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెరవెనుక ప్రజాప్రతినిధి సోదరుడు
స్థానికంగా ఉన్న భూమిలో ఓ ప్రజాప్రతినిధి సోదరుడు తెర వెనక ఉండి తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భూమిలో సగం ఆయన వాటా పోనూ.. మిగిలిన దానిలో పాపంపేటకు చెందిన మరో నాయకుడు, అక్కంపల్లికి చెందిన ఇంకో నాయకుడికి వాటా ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టాలు తీసుకున్న వర్గంలోని ఓ నాయకుడిని కలుపుకోవడంతో భూమిని కాజేసే పని సులువుగా కానిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందటే పట్టాలు రద్దయిన విషయం తెలియడంతో భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. వ్యవహారం అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతుండటంతో భూమిని స్వాధీనం చేసుకోవడంలో సదరు అధికారులు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.